
వక్ఫ్ బిల్లుపై సుప్రీం కోర్టులోనే తేల్చుకుంటాం
కర్నూలు(టౌన్): ముస్లింల ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వక్ఫ్ బిల్లును సుప్రీం కోర్టులోనే తేల్చుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తాను మొదటి, రెండవ పిటిషన్లు వేశామన్నారు. బుధవారం స్థానిక పాతబస్తీలోని రాయల్ ఫంక్షన్ హాలులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం సమాజాన్ని నిర్వీర్యం చేయాలని దేశంలో బీజెపీ కూటమి కంకణం కట్టుకుందన్నారు. దేశ వ్యాప్తంగా ఈ బిల్లును ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, కడప, కర్నూలు వంటి అనేక జిల్లాలో పెద్ద ఎత్తున్న ఆందోళనలు ప్రారంభమయ్యాయన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఉద్ధృతం అవుతాయన్నారు. వక్ఫ్ ఆస్తులను కొట్టేయాలని, భూములను స్వాధీనం చేసుకొవాలన్న కుట్ర జరుగుతోందన్నారు. తాజాగా కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ బిల్లులో ఇతర మతస్థులను చేర్చడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. బిల్లుకు పార్లమెంటులో 232 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయంటే వ్యతిరేకించినట్లు కాదా అన్నారు.
ముస్లింల ఓట్లు వద్దన్న బీజెపీతో
చంద్రబాబు దోస్తీ
రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, బహిరంగంగా ముస్లింల ఓట్లు వద్దన్న భారతీయ జనాతా పార్టీతో చంద్రబాబు నాయుడు దోస్తీ కట్టారన్నారు. బిల్లుకు ఆమోదం వ్యక్తం చేసిన చంద్రబాబు సిగ్గు లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం రాజ్యసభలో ఆమోదం వ్యక్తం చేసినట్లు చెప్పడం దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. మీ మద్దతు లేకుండా బిల్లు పాస్ అయ్యేదా అన్నారు. తమ పార్టీ నుంచి ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడిన విషయం కనిపించలేదా అని ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు హఫీజ్‌ఖాన్