
మత్స్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(అగ్రికల్చర్): నగరంలోని దేశీయ మత్స్యశిక్షణా కేంద్రంలో కార్యక్రమం మూడు నెలల పాటు నిర్వహించే శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి రంగనాథబాబు తెలిపారు. చేపల పెంపకంపై ఆసక్తి కలిగిన రాయలసీమ జిల్లాలకు చెందిన యువత సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. మే 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని, మత్స్య సహకార సంఘాల సభ్యులు, చేపల పెంపకందారులు, లైసెన్స్ దారులు అర్హులేనని పేర్కొన్నారు. 7వ తరగతి ఉత్తీర్ణులై చేపల పెంపకం పట్ల ఆసక్తి ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 29వ తేదీలోపు బంగారుపేటలోని మత్స్యశాఖ అధికారి కార్యాలయానికి పంపాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 30న ఇంటర్వ్యూలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తామన్నారు. శిక్షణా కాలంలో నెలకు రూ.1000 ఉపకార వేతనం చెల్లించబడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రాయలసీమలోని జిల్లాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవచ్చని కోరారు.
కొలనుభారతిలో
ప్రత్యేక పూజలు
కొత్తపల్లి: సరస్వతీ క్షేత్రంగా విరాజిల్లుతున్న కొలనుభారతి క్షేత్రంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేటప్టారు. పంచమి మూల నక్షత్రం కావడంతో అమ్మవారిని అలంకరించి పంచసూక్తములతో అభిషేకాలు, కుంకుమార్చనలు, మంగళహారతి వంటి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు శ్రీనివాస శర్మ అమ్మవారి సన్నిధిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులకు బీజాక్షరాలు రాయించి సుమారు 50 మంది దాక అక్షరాభ్యాసాలు నిర్వహించారు.
పిడుగు పాటుకు ఎద్దు మృతి
ఆస్పరి: మండల కేంద్రమైన ఆస్పరిలో శుక్రవారం పిడుగు పాటుకు ఓ ఎద్దు మృతి చెందింది. రైతు మహబూబ్‌బాషా వామి దొడ్డిలో ఎద్దులను కట్టేశాడు. అయితే ఎద్దులకు సమీపంలో పిడుగు పడటంతో ఒకటి అక్కడికక్కడే మృతి చెందగా మరొకటి స్పల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఎద్దు మృతి చెందడంతో రైతుకు రూ.60 వేలు నష్టం వాటిల్లింది.
మహిళ అదృశ్యం
బేతంచెర్ల: పట్టణంలోని శ్రీ నగర్ కాలనీకి చెందిన ఓ మహిళ రెండు రోజులుగా కనిపించడం లేదు. స్థానికంగా నివాసముంటున్న నాగమణి ఓ ప్రైవేటు ఫైనాన్స్ కార్యాలయంలో పని చేస్తోంది. గురువారం ఉదయం ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లి మధ్యాహ్నం తర్వాత బయటకు వచ్చిన మహిళ ఇంటికి రాలేదు. బంధువులు, ఆయా ప్రాంతాల్లో ఆచూకీ కోసం గాలించినా తెలియలేదు. తమ కుమార్తె కనిపించడం లేదని నాగమణి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కేసీ తిరుపాల్ తెలిపారు.

మత్స్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం