
డోన్‌లో ఇష్టారాజ్యం
కర్నూలు(అగ్రికల్చర్): మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో కొనుగోలు చేసిన కందులు గోదాముల దగ్గర తిరస్కరణకు గురవుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి వ్యాపారులు, దళారీల దగ్గర నాసిరకం కందులను సైతం కొనుగోలు చేస్తుండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఏ పంటనైనా మద్దతు ధరతో కొనుగోలు చేయాలంటే కనీస నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో టీడీపీతో పాటు కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ అనుకూల వ్యాపారులు, దళారీల నుంచి నాణ్యత లేని కందులను సైతం కొనుగోలు చేస్తున్నారనే పిర్యాదులు ఉన్నాయి. మొత్తం కొనుగోలు కేంద్రాలను ఆయా జిల్లాల మార్క్‌ఫెడ్ మేనేజర్‌లు పర్యవేక్షించాల్సి ఉంది. అయితే కొనుగోలు కేంద్రాల నుంచి జిల్లా మేనేజర్లకు గుడ్ విల్ వస్తుండటం వల్ల చూసీచూడనట్లు పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిని అవకాశంగా తీసుకొని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు దళారీలు, వ్యాపారుల నుంచి కందులు మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు. ముడుపులు ముట్టచెబుతుండటం వల్ల నాసిరకం కందులను కూడా కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయిస్తుండటం గమనార్హం.
సెంట్రల్, స్టేట్ వేర్‌హౌసింగ్
గోదాముల్లో నిల్వ
దాదాపు మూడు నెలలుగా మద్దతు ధరతో కందుల కొనుగోలు జరుగుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 21వ తేదీతో కొనుగోలు కేంద్రాలను ముగించాల్సి ఉంది. అయితే కందుల కొనుగోలు ప్రక్రియను మరింత పొడిగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 5,575 టన్నులు, నంద్యాల జిల్లాలో 5,500 టన్నులు కొనుగోలు చేశారు. కర్నూలు జిల్లాలో 25 మండలాలు, నంద్యాల జిల్లాలో 21 మండలాల్లో కందుల కొనుగోలు జరుగుతోంది. కొనుగోలు చేసిన కందులను ఆదోని, నందికొట్కూరు, డోన్ తదితర ప్రాంతాల్లోని సెంట్రల్ వేర్‌హౌసింగ్, స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. గోదాముల్లో కందులు అన్‌లోడ్ చేసే సమయంలో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తారు. సరుకు గోదాము చేరిన తర్వాతనే రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ అవుతుంది. పండించిన కందులను రైతులు అమ్ముకోవడం దాదాపు పూర్తయింది. మార్కెట్ యార్డులకు కూడా కందులు రావడం తగ్గిపోయింది. దళారీలు, వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరతో కొనుగోలు చేసిన కందులను గోదాముల్లో నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ధర పెరిగినప్పుడు అమ్ముకోవాలనేది ఉద్దేశం. అయితే ధర మరింత తగ్గుతుండటంతో కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో అమ్ముకునేందుకు బయటికి తీసుకొస్తున్నారు.
2,500 క్వింటాళ్లకు పైగా కందులు రిజెక్ట్
మార్క్‌ఫెడ్ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ముడుపులు ఎర వేసి మద్దతు ధరతో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముడుపులు ముడుతుండటంతో నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోని పరిస్థితి. నిజమైన రైతులు తీసుకుపోతే మూడు నాలుగు సార్లు జల్లెడ వేస్తారు. దళారీలు తీసుకెళ్తే జల్లెడ వేయకుండానే కొంటుండటం గమనార్హం. అయితే కొనుగోలు కేంద్రాల వద్ద జరిగే అక్రమాలు గోదాముల దగ్గర బయటపడుతున్నాయి. అక్కడ నిర్వహిస్తున్న తనిఖీల్లో నాణ్యత గుట్టు బయట పడుతోంది. కర్నూలు జిల్లాకు సంబంధించి దాదాపు 1,575 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు సంబంధించి 950 క్వింటాళ్ల కందులు రిజెక్ట్ అయ్యాయి.
మార్క్‌ఫెడ్ అధికారులకు
గుడ్‌విల్ ఇవ్వాల్సిందే..
మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రక్రియ మొదలవుతుందంటే మార్క్‌ఫెడ్ అధికారులకు పండుగే. నోడల్ ఏజెన్నీ మార్క్‌ఫెడ్ అయినప్పటికీ క్షేత్రస్థాయిలో డీసీఎంఎస్, పీఏసీఎస్‌ల ద్వారానే కొనుగోలు చేస్తారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మార్క్‌ఫెడ్ అధికారులకు గుడ్‌విల్ భారీ మొత్తంలోనే ఇచ్చుకోవాల్సి ఉంది. లేదంటే 50 నుంచి 100 క్వింటాళ్లకు ఒక క్వింటా కందులు ముడుపుల కింద ఇవ్వాల్సిందేనని సమాచారం. ఎవరికి వారు మామూళ్ల మత్తులో పడిపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో టీడీపీ మద్దతుదారులైన దళారీలు, వ్యాపారుల హవా నడుస్తోంది. మద్దతు కొనుగోలు కేంద్రాలు వ్యాపారులు, దళారీలకే ఏర్పాటు చేసినట్లు అర్థమవుతోంది.
ఇదీ కొను‘గోలుమాల్’ వ్యవహారం
కందులు నాణ్యత లేకపోతే ఒకటి, రెండు సార్లు జల్లెడ వేయాల్సి ఉంది. అయితే ముడుపుల కారణంగా వచ్చిన వాటిని వచ్చినట్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల గోదాముల దగ్గర జరుపుతున్న నాణ్యత ప్రమాణాల్లో వందల క్వింటాళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి.
● నిజమైన రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు నాణ్యతకు పెద్దపీట వేస్తుండటం.. దళారీలు, వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు నాణ్యతను విస్మరించడం వెనుక ముడుపుల వ్యవహారం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
మార్గదర్శకాలకు
అనుగుణంగానే కొనుగోళ్లు
కందుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. మార్గదర్శకాలకు అనుగుణంగా మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నాం. అనంతరం సెంట్రల్, స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ గోదాములకు తరలిస్తున్నాం. అక్కడ ప్రతి సంచి కందుల నాణ్యతను చెక్ చేస్తున్నారు. తగిన నాణ్యతా ప్రమాణాలు లేకుంటే రిజెక్ట్ అవుతాయి. రైతులు అంగీకరిస్తే మళ్లీ జల్లెడ వేసి పంపుతాం. జిల్లాకు సంబంధించి 80–90 టన్నుల వరకు రిజెక్ట్ అయ్యాయి. అంతమాత్రాన అక్రమాలు జరిగినట్లు కాదు.
– జి.రాజు, జిల్లా మేనేజర్, కర్నూలు
2014–2018 మధ్య కొనుగోలు కేంద్రాల్లో భారీ అక్రమాలు
టీడీపీ అధికారంలో ఉన్న 2014–15 నుంచి 2018–19 వరకు దళారీలు, వ్యాపారుల నుంచి కందులు, శనగలు మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆత్మకూరులోని వేర్ హౌసింగ్ గోదాముల్లో నిల్వ చేశారు.
అప్పట్లో గోదాము అధికారులను మచ్చిక చేసుకోవడం వల్ల నాసిరకం సరుకును కూడా అనుమతించారు.
రెండేళ్ల తర్వాత నాఫెడ్ అధికారులు పరిశీలిస్తే పుచ్చుపట్టి పనికిరాని కందులను గుర్తించారు.
వందలాది టన్నుల పంట ఉత్పత్తులు పనికి రాకుండాపోయాయి.
తాజాగా తిరిగి టీడీపీ ప్రభుత్వంలో నాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి.
దళారీలు, వ్యాపారుల నుంచి మామూళ్ల మత్తులో పడి నాసిరకం కందులు కొనుగోలు చేస్తుండటం వల్ల రానున్న రోజుల్లో దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు.
అన్ని మండలాల్లో డీసీఎంఎస్, పీఏసీఎస్‌ల ప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లి కందులను కొనుగోలు చేస్తే డోన్‌లో మాత్రం రైతులు మార్కెట్ యార్డుకు తెచ్చి అమ్ముకునేలా సెంటర్ నిర్వాహకుడు షరతు విధించాడు. డోన్ మండలంలో డీసీఎంఎస్ బ్రాంచ్ కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తోంది. టీడీపీ వర్గీయులు బలంగా ఉన్న గ్రామాలకు వెళ్లి కందులను మద్దతు ధరతో కొనుగోలు చేశారు. ఈ విధంగా 4 గ్రామాల్లో మాత్రమే కొన్నారు. మిగిలిన అన్ని గ్రామాల రైతులు మార్కెట్‌యార్డుకు తెచ్చి అమ్ముకోవాలనే నిబంధన పెట్టారు. ఇందువల్ల రైతులపై రవాణ చార్జీల భారం పడింది. క్వింటాకు 2800 గ్రాముల కందులు అదనంగా తీసుకున్నారు. మద్దతు ధరతో అమ్ముకోవడానికి వెళ్లిన రైతులు దోపిడీకి గురయ్యారు.