
డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే!
ప్రతి సారీ డాక్టర్ రాసిన తాజా ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే
ప్రిస్క్రిప్షన్ చూపకపోతే మందులు ఇవ్వని మెడికల్ షాపులు
ఇస్తే నోటీసులు తప్పవంటున్న అధికారులు
రూ.50 మాత్రలకు రూ.వెయ్యి దాకా ఖర్చు
ప్రభుత్వ చర్యలతో రోగుల బెంబేలు
కర్నూలు(హాస్పిటల్): ఎవ్వరికై నా జ్వరం, జలుబు, దగ్గు, వాంతులు, విరేచనాలు వంటి సాధారణ జబ్బులు వస్తే చాలా మంది డాక్టర్ వద్దకంటే మెడికల్‌షాపులకు ముందుగా వెళ్తారు. అక్కడ వారికి వచ్చిన అనారోగ్య లక్షణాలు చెప్పి మందులు ఇవ్వాలని కోరతారు. ఈ మేరకు రెండు, మూడు రోజులకు సరిపడా మందులు ఇస్తే చాలా వరకు తగ్గిపోతుంది. దీనివల్ల డాక్టర్ వద్దకు వెళ్లే సమయం, ఖర్చు మిగిలిపోతుందని సామాన్యుని భావన. కానీ ఇకపై ఇలా నేరుగా మందుల దుకాణానికి వెళ్లి మందులు ఇవ్వాలని కోరితే కుదరదు. అలా ఏవి పడితే ఆ మందులు ఇవ్వొద్దని మందుల దుకాణదారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యాంటిబయాటిక్స్‌తో పాటు నిద్ర, ఆందోళన, డిప్రెషన్ మందులు వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా ఇస్తే లైసెన్స్ రద్దు చేస్తామని చెబుతోంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3,100 దాకా రిటైల్ మెడికల్ షాపులు, 500 దాకా హోల్‌సేల్ మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు వ్యాపారం నిర్వహిస్తున్నారు. కర్నూలు, ఆదోని, నంద్యాల డివిజన్‌లకు నలుగురు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వీరు ఒక్కొక్కరు ప్రతి నెలా 40 దుకాణాలు తనిఖీలు చేయాల్సి ఉంది. ముఖ్యంగా దుకాణంలో ఫార్మాసిస్టు ఉన్నారా, మందుల కొనుగోలు, అమ్మకాల వివరాలు, కొనుగోలుదారులకు బిల్లు ఇస్తున్నారా, వైద్యుల ప్రిస్కిప్షన్ ఆధారంగా మందులు ఇస్తున్నారా, గడువు తీరిన, గడువు ఉన్న మందులు విక్రయిస్తున్నారా, నిషేధిత మందులను అమ్ముతున్నారా, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలను పరిశీలించి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. వారు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఏడీ స్థాయి అధికారులు సదరు దుకాణాలపై చర్యలు తీసుకుంటారు.
ఇటీవల దాడులతో కంగారు..
ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కలిసి జిల్లా వ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు నిర్వహించారు. పలు దుకాణాల్లో యాంటిబయాటిక్స్, నిద్రమాత్రలు, మత్తును కలిగించే నొప్పి మాత్రలు, ఆందోళన, డిప్రెషన్ మందులు వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పలువురికి ముందుగా నోటీసులు ఇచ్చి వారు ఇచ్చిన సంజాయిషీ ఆధారంగా వారం రోజుల పాటు సస్పెన్షన్ విధించారు. అప్పటి నుంచి వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా యాంటిబయాటిక్స్, మత్తును కలిగించే మాత్రలు విక్రయించేందుకు దుకాణదారులు వెనుకడుగు వేస్తున్నారు. తాజాగా వైద్యులు రాసిచ్చిన చీటిని తెస్తేనే మందులు ఇస్తామని తెగేసి చెబుతున్నారు.
డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించడం నేరం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల గరుడ ఆపరేషన్ పేరుతో నార్కోటిక్ డ్రగ్స్ అమ్మకాలపై నిఘా ఉంచాం. ఈ మేరకు పలు దుకాణాలపై దాడులు నిర్వహించి చర్యలు తీసుకున్నాము. హెచ్ వన్ రిజిస్టర్‌లో ఉన్న యాంటిబయాటిక్స్, యాంటి టీబీ, మత్తుకలిగించే మందులు డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించకూడదు. నిద్ర, ఆందోళన, డిప్రెషన్ మందులు రెగ్యులర్‌గా వాడుతున్న వారు డాక్టర్ రాసిన చీటిని తీసుకొచ్చి మందుల దుకాణాల్లో చూపిస్తే దానిపై సదరు దుకాణదారుడు ఇచ్చిన మందుల సంఖ్య, తేదిని రాసి సీలు వేస్తారు. దీనివల్ల నిర్ణీత సమయంలో తిరిగి అంతకుమించి మందులు వాడకుండా నియంత్రించబడుతుంది.
– వి. వీరశేఖర్, డిప్యూటీ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ
వృద్ధులు, రోగులు నరకయాతన
నార్కోటిక్ డ్రగ్స్‌ను డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులతో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఇటీవల నిర్వహించిన దాడులతో మెడికల్‌షాపుల వారు విక్రయాలు నిలిపివేశారు. డాక్టర్ తాజాగా రాసిచ్చిన చీటి తెస్తేనే మందులు ఇస్తామని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. దీంతో కొంత కాలంగా ఆయా మందులకు అలవాటుపడిన వారు మాత్రలు లభించక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడుతూ వైద్యుల సూచన మేరకు కొంత కాలంగా మందులు వాడేవారు, గుండె, ఇతర ఆరోగ్య సమస్యలతో నిద్రకరువై వైద్యుల సూచన మేరకు నిద్రమాత్రలు, ఆందోళన, డిప్రెషన్ తగ్గించే మాత్రలు వాడే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరో దురలవాట్లకు బానిసలై ఇలాంటి మందులు కొంటే రెగ్యులర్‌గా వాడే మాలాంటి వారిని ఇబ్బందులకు గురిచేస్తే ఎలాగని వారు ప్రశి్నస్తున్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ నిద్ర రాక, ఆందోళన, డిప్రెషన్ పెరిగి మరింత అనారోగ్యం కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన చెందుతున్నారు.
రూ.50ల మాత్రలకు రూ.వెయ్యి దాకా ఖర్చు
ఇప్పటి వరకు ఆయా ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు వైద్యుల సూచనలతో మత్తు కలిగించే మందులు వాడుతూ వస్తున్నారు. ఒకసారి డాక్టర్ వద్ద చూపించుకుని నెలల తరబడి అవే మందులను మెడికల్‌షాపుల్లో కొనుగోలు చేసి వాడుతున్న వారు ఉన్నారు. చాలా చోట్ల తాజాగా వైద్యులు రాసిచ్చిన చీటి ఆధారంగానే ఇలాంటి మందులు ఇస్తారు. కానీ పరిచయం ఉన్న కారణంగా కొందరు వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే మందులు ఇచ్చేస్తున్నారు. దీనికితోడు ప్రతిసారీ డాక్టర్ వద్దకు వెళ్లాలంటే ప్రయాణ చార్జీలు, సమయం, డాక్టర్ ఫీజు కలిపి రూ.500ల నుంచి రూ.1000ల దాకా అవుతోంది. అదే నేరుగా మెడికల్‌షాపులకు వెళ్లి గతంలో రాసిన మందులు కొంటే రూ.50ల నుంచి రూ.100లతో పని పూర్తవుతుంది. తాజా నిబందనల వల్ల ఆర్థిక భారం అధికమవుతోందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.