
‘ఉపాధి’ పనులు 7 శాతమేనా?
● అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్
కర్నూలు(సెంట్రల్): ఉపాధి పనుల్లో ఏప్రిల్ నెల నందవరం, గోనెగండ్ల, హాలహర్వి, ఆస్పరి మండలాలు 7 శాతంలోపే ఉండడంపై జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో పురోగతి కనిపించకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తానని ఎంపీడీఓలు, ఏపీఓలను హెచ్చరించారు. వేసవిలో కూలీలకు ముమ్మరంగా ఉపాధి పనులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి, హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయాల సేవలపై జిల్లా, మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ లోపు 8500 ఫార్మ్‌ఫాండ్‌లను పూర్తి చేయాలన్నారు. పశువుల తొట్టె నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. హౌసింగ్‌కు సంబంధించి జూన్1 నాటికి 11 వేల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో ఇప్పటి వరకు 5,700 ఇళ్లను పూర్తి చేశామన్నారు. ఆదోని డివిజన్‌లోనే ఎక్కువగా ఇళ్ల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. టెలీకాన్పరెన్స్‌లో ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్‌డీఓలు సందీప్‌కుమార్, ఆర్‌డీఓ భరత్‌నాయక్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డ్వామా పీడీ వెంకటరమణయ్య పాల్గొన్నారు.
రక్షిత నీటిని సరఫరా చేయాలి
కర్నూలు(అర్బన్): అన్ని పంచాయతీల్లోని ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ ఆదేశించారు. మంగళవారండీఎల్‌పీఓ టీ లక్ష్మితో కలిసి కోడుమూరు, గూడూరు మండలం పెంచికలపాడు గ్రామా ల్లోని తాగునీటి ట్యాంకులు, ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాలను పరిశీలించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలన్నారు.