
వైద్యానికి ‘సెలవు’
● వంద పడకల ఆసుపత్రిలో వైద్యుల కొరత ● 23 మంది వైద్యుల్లో ప్రస్తుతం ఆరుగురే ● 11 మంది సెలవులో, మరో ఆరుగురు బదిలీ ● నాడు ఓపీ 600.. నేడు 200 ● సేవలు అందక ప్రజల అవస్థలు
డోన్: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు నానాటీకి సన్నగిల్లుతున్నాయి. పట్టణ శివారులో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్లతో కార్పొరేట్ తరహాలో ఆధునిక యంత్ర పరికరాలతో వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద పడకల ఆసుపత్రిలో వైద్యం దైవాదీనంగా మారుతోంది. ఆసుపత్రి ప్రారంభం 23 మంది వైద్యులను గత ప్రభుత్వం నియమించగా.. ఇందులో సగానికి సగం మంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడి నుండి బదిలీ, సెలవులపై వెళ్లిపోయారు. గతంలో ప్రతిరోజూ 600 వరకు ఓపీ నడవగా ప్రస్తుతం 200కు పడిపోయింది. ఇందుకు కారణం ప్రస్తుతం వైద్యుల్లో ఆరు బదిలీలపై వెళ్లిపోవడం, 11 మందిలో కొందరు మహిళా వైద్యులు ప్రసూతీ సెలవు, కొంతమంది మెడికల్ లీవ్‌లపై వెళ్లిపోయారు. రేడియాలజిస్ట్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో డాక్టర్ల సంఖ్య ప్రస్తుతం ఆరుకు పరిమితమైంది. ఇందులో ఆర్థో డాక్టర్‌ను జిల్లా వ్యాప్తంగా జరిగే సదరన్ క్యాంపులకు డ్యూటీపై వేయడంతో ఆయన కూడా అందుబాటులో లేరు. ఇందుకు సంబంధించిన రోగులందరూ ప్రతిరోజూ ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి ఆసుపత్రికి రావడం, డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వెళ్లిపోవడం నిత్యకృత్యమైంది. నిన్నటి వరకు శస్త్రచికిత్సలు, ఆధునాతన వైద్య సేవలు అందించిన ఆసుపత్రిలో సేవలు మృగ్యమవుతుండటంతో పేదలు ఆందోళన చెందుతున్నారు.
ఆసుపత్రి ఆవరణలో
నేలపై కూర్చున్న దివ్యాంగురాలు
గర్భిణుల కష్టాలు
ప్రభుత్వాసుపత్రిలో అల్ట్రా సౌండ్ స్కానింగ్ వైద్యులు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోవడంతో ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు ఇక్కడి వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఒక్కొక్క స్కానింగ్‌కు రూ.1500 నుండి రూ.2వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. సాధారణ స్కానింగ్ కోసం కూడా గంటల తరబడి నేలపై కూర్చొని వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూడా కనీసం ఆసుపత్రిలో ఫర్నీఛర్ కూడా ఏర్పాటు చేయలేదు.

వైద్యానికి ‘సెలవు’

వైద్యానికి ‘సెలవు’

వైద్యానికి ‘సెలవు’