
ఉగ్ర దాడి హేయమైన చర్య
● వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో
కొవ్వొత్తులతో నిరసన
కర్నూలు(టౌన్): అమాయకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని కర్నూలు మేయర్ బి.వై.రామయ్య అన్నారు. బుధవారం రాత్రి స్థానిక వైఎస్సార్ సర్కిల్ వద్ద కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఊచకొత ఘటనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. అమాయకులను పొట్టన పెట్టుకోవడం క్షమించరాని నేరమన్నారు. దేశంలో అలజడి సృష్టించే ఉద్దేశంతో ఉగ్రవాదులు చేస్తున్న కుట్రలను కేంద్ర ప్రభుత్వం తిప్పి కొట్టాలన్నారు.
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైందన్నారు. దీన్ని కూకటి వేళ్లతో పెకలించాలన్నారు.
● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మూద్దురు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశీయులను సైతం ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా చంపేశారన్నారు. ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం మోపాలన్నారు.
● వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అహమ్మద్ ఆలీఖాన్ మాట్లాడుతూ కశ్మీర్ ఘటనకు కారణమైన ఉగ్ర మూకలను వెతికి పట్టుకొని కఠినంగా శిక్షించాలన్నారు. అమాయకులను అత్యంత క్రూరంగా చంపడాని సహించరాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.