
జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్
కర్నూలు: ప్రజల భద్రత, రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు జిల్లా అంతట విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం ఏకకాలంలో జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా రోడ్డు భద్రత నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేవారు హెల్మెట్/సీటు బెల్టు ధరించాలని, డ్రంకెన్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని వాహనదారులకు సూచనలు చేశారు. ఆయా స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి గొడవలకు దూరంగా ఉండాలని, మహిళా నేరాలు, సైబర్ మోసాలు, బాల్య వివాహాలు, పేకాట వంటి వాటిపై పోలీసులకు సమాచారమివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాల వాడకంతో కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించి వాటికి దూరంగా ఉండాలని యువకులకు సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.