కేన్సర్ అంటేనే హడలిపోతాం. ఎందుకంటే ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా వచ్చేస్తుంది. దాని స్టేజ్‌ని బట్టి సులభంగా ఆ వ్యాధి నుంచి బయటపడగలం లేదంటే ఇక అంతే సంగతులు. ఆ కేన్సర్‌లలో మహిళలకు వచ్చే గర్భాశయ కేన్సర్(సెర్వికల్) మరింత ప్రమాదకరమైంది. బాలీవుడ్ ప్రముఖ నటీ పూనమ్ పాండ్ మృతికి కారణమైంది కూడా ఈ కేన్సరే. దీనికి చికిత్సా విధానం కూడా కాస్త క్రిటికలే. లక్షణాలను ముందుగా గుర్తిస్తే మెరుగైన చికిత్స ద్వారా పరిస్థితిని అదుపు చేయవచ్చు కానీ.. ఒక దశ దాటిన తరువాత చికిత్సలతో లాభం తక్కువే. అందువల్లే ఏటా కొన్ని వేలమంది మహిళలు ఈ కేన్సర్ బారిన పడే చనిపోతున్నారు. అసలు ఎందుకు వస్తుంది? ముందుగా ఎలా గుర్తించాలి?
సెర్వికల్ కేన్సర్ ఎందుకు వస్తుందంటే..
ఈ కేన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) కారణంగా వస్తుంది. తక్కువ వయస్సులో వివాహం చేయడం, విచ్చలవిడి లైంగిక సంబంధాలు, స్త్రీ, పురుషులిద్దరికీ బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ కేన్సర్ రావడానికి కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ప్రధానంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సుగల స్త్రీలకు ఈ రకమైన కేన్సర్ సోకే అవకాశాలు ఎక్కువ.
లక్షణాలు ఇవీ..
మొదటి దశ సర్వైకల్ కేన్సర్ ఎటువంటి లక్షణాలు కనిపించవు.
వ్యాధి ముదిరితే...
కలయిక తర్వాత, పీరియడ్స్ మధ్య, మెనోపాజ్ తర్వాత యోని రక్తస్రావం
దుర్వాసనతో కూడిన నీటి, రక్తపు యోని ద్రవాలు
కలయిక సమయంలో పెల్విక్ నొప్పి
సర్వైకల్ కేన్సర్‌లో రకాలు:
పొలుసుల కణ కేన్సర్..
ఈ సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయం బయటి భాగాన్ని కప్పి ఉంచే సన్నని, చదునైన కణాలలో పొలుసుల కణాలు ప్రారంభమవుతాయి. ఇది యోనిలోకి ప్రవేశిస్తుంది. చాలా గర్భాశయ కేన్సర్లు పొలుసుల కణ క్యాన్సర్.
అడెనోకార్సినోమా. .
ఈ గర్భాశయ క్యాన్సర్ కాలమ్ ఆకారపు గ్రంధి కణాలలో ప్రారంభమవుతుంది.
కారణాలు..
గర్భాశయ ముఖద్వారంలోని ఆరోగ్యకరమైన కణాలు వాటి డీఎన్‌ఏలో మార్పులు (మ్యుటేషన్లు) జరిగినప్పుడు గర్భాశయ కేన్సర్ ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన కణాలు నిర్ణీత రేటుతో పెరుగుతాయి. కొద్ది సమయంలో చనిపోతాయి. కేన్సర్ కణాలు దీనికి భిన్నం. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతూనే ఉంటాయి. పేరుకుపోయిన అసాధారణ కణాలు ఒక కణితిని ఏర్పరుస్తాయి. కేన్సర్ కణాలు సమీపంలోని కణజాలాలపై దాడి చేస్తాయి. శరీరంలోని ఇతర చోట్ల వ్యాప్తి చెందడానికి కణితి నుంచి విడిపోతాయి.
గర్భాశయ కేన్సర్‌కు కారణమేంటో స్పష్టంగా తెలియదు, కానీ హెచ్‌పీవీ పాత్ర పోషిస్తుంది. హెచ్‌పీవీ చాలా సాధారణం. ఈ వైరస్ ఉన్న ప్రతి ఒక్కరికి కేన్సర్ రాదు. లైఫ్‌స్టైల్, ఇతర కారకాల కారణంగా వచ్చే అవకాశం ఉంది.
చికిత్స..
నయం కాని గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు ల్యాప్రోస్కోపి పరికరం ద్వారా ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేయవచ్చు. దీనివల్ల కోత, కుట్టు ఉండదు. త్వరగా ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. హెరి్నయా వచ్చే అవకాశం కూడా ఉండదు. సాధారణంగా వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్‌గా మారుతుంది. దీనివల్ల వివాహం అయిన మహిళలు ప్రతి సంవత్సరం పాప్‌స్మియర్ టెస్ట్ చేయించుకుంటే, క్యాన్సర్‌ను ప్రాథమికంగా గుర్తించగలిగితే నయం చేసుకోవచ్చు. దీనికితోడు కౌమారదశ బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి 70 నుంచి 80శాతం వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.
ఇలా చేస్తే నివారణ సాధ్యం..
2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికను అందించింది. దీనికింద 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 సంవత్సరాల వయస్సులోపు హెచ్‌పీవీ వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సుగల కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్‌తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి.
(చదవండి: ముక్కు లేకుండానే జన్మ..ఇప్పుడెలా ఉన్నాడంటే?)
Comments
Please login to add a commentAdd a comment