బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే సర్వైకల్(గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్) మరణించిందనే షాకింగ్ న్యూస్ వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలతో పాటు ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇండస్ట్రీలో మహా నటిగా గుర్తింపు పొందకపోయినప్పటకి ఒక శృంగార తారగా గుర్తింపు పొందింది. ఒక వ్యాధితో ఆమె మరణించినట్లు వార్త రాగానే చాలామందిలో ఆందోళన నెలకొంది. నేడు తాను బతికే ఉన్నానని, ఇదంతా ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే కావడంతో ప్రజల్లో అవగాహన కోసం చేసినట్లు తెలిపి సింపుల్‌గా క్షమించమని కోరింది.
ఈ విషయంపై నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేఖత వస్తుంది. క్యాన్సర్ గురించి అందరికీ అవగాహన కల్పించాలనే క్రమంలో ఆమె తనను తాను చంపుకున్నట్లు కొందరు తెలుపుతున్నా ఎక్కువ మంది ఆమె ఆలోచనా తీరును తప్పుబడుతున్నారు. క్యాన్సర్ నివారణ గురించి ప్రచారంలోకి తీసుకురావాలంటే ఎన్నో దారులు ఉన్నాయి కానీ ఇలా ప్రజల ఉద్వేగాలతో ఆటలాడటం ఏంటని తప్పుబడుతున్నారు. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలనే క్రమంలో పూనమ్ పాండే చేసిన పని ఎంతమాత్రం కరెక్ట్ కాదని దుమ్మెత్తిపోస్తున్నారు.
చాలా రోజుల నుంచి ఆమె పేరు వెలుగులో లేకుండా పోయింది. చేతిలో సినిమా ఛాన్సులు లేవు. దీంతో ఎలాగైనా తను వైరల్ కావాలని క్యాన్సర్ పేరుతో చనిపోయినట్లు నాటకం ఆడిందని విమర్శలు వస్తున్నాయి. పూనమ్ పబ్లిసిటీ స్టంట్ కోసం తన మరణ వార్తను ఎంతగానో ఎంజాయ్ చేస్తోందని విమర్శలు వచ్చాయి. పూనమ్ చేసిన ఆ ఒక్క ప్రకటన దేశంలోని అందరినీ నమ్మించగలిగింది. ఆమె మరణించిందని వినగానే కంగనా రనౌత్, సింగర్ చిన్మయి వంటి ఎందరో స్టార్స్ దిగ్భ్రాంతి చెందారు. ఆపై చాలామంది బాలీవుడ్ నటీనటులు సంతాపాన్ని కూడా తెలియచేశారు.
(ఇదీ చదవండి: బతికే ఉన్నానని ట్విస్ట్ ఇచ్చిన పూనమ్ పాండే.. ఇదంతా ఎందుకు చేసిందంటే?)
ఆమె కేవలం సెన్సేషన్ కోసమే ఇలాంటి నాటకం ఆడిందని దీనిని ఘోరమైన నేరంగా పరిగణించాల్సి వుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఎంతో సున్నితమైన అంశం. ఇలాంటి విషయంలో పరాచికలాడటం ఏంటని తప్పుబడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్‌తో నిజంగానే బాధపడుతున్న ఎందరో మహిళలు పూనమ్ మరణవార్త తెలియగానే ఎంతగానో మదనపడి ఉంటారు. ఇంతటి సున్నితమైన అంశాన్ని తన పబ్లిసిటీ కోసం ఉపయోగించడం ఏంటి..? అంటూ ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని వాదన వినిపిస్తోంది.
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కామెంట్
సర్వైకల్ క్యాన్సర్ సమస్యపై నువ్వు (పూనమ్) చేసిన పని అందరికీ రీచ్ అయి ఉంటుంది. కానీ మీరు అవలంబించిన ఇలాంటి పద్ధతి కొంత విమర్శలకు దారితీయవచ్చు, కానీ మీ ఉద్దేశాన్ని లేదా ఇలాంటి బూటకంతో మీరు ఏమి సాధించారు అని ఎవరూ ప్రశ్నించలేరు .. సర్వైకల్ క్యాన్సర్‌పై చర్చ ఇప్పుడు దేశం అంతటా ట్రెండింగ్‌లో ఉంది. మీ మాదిరే మీ ఆత్మ చాలా అందంగా ఉంది. మీరు చాలా సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను.' అని వర్మ తన ఎక్స్ పేజీలో రాసుకొచ్చారు.
పబ్లిసిటీ కోసం 19 ఏళ్ల వయసులోనే ఇలాంటి పనితో ..
2011లో పూనమ్ పాండే క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే తాను టీమ్ ఇండియా కోసం గ్రౌండ్‌లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి వార్తల్లో నిలిచింది. అది నిజం కావడంతో ఆమె తన మాట నిలబెట్టుకోవాలని చేసిన ప్రయత్నాన్ని బీసీసీఐ అడ్డుకుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు. ఆ తర్వాత సంవత్సరం తనకు ఎంతో ఇష్టమైన IPL జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటో పోస్టు చేసి సంచలనం రేపింది. అలా ఎప్పుడూ ఆమె నెట్టింట తన పేరు ఉండాలని తాపాత్రయ పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.
కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబే నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు కూడా కావాలనే చేసినట్లు వార్తలు వచ్చాయి. 2017లో పూనమ్ పాండే 'పాండే యాప్' ప్రారంభించింది. కానీ అందులోని కంటెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ గూగుల్ ఒక గంటలోపే ప్లే స్టోర్ నుంచి యాప్‌ను తొలగించేసింది.
పూనమ్ పాండే తన ప్రేమికుడి సామ్ బాంబేతో కొద్దిరోజుల పాటు డేటింగ్ చేసి వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లారు. అయితే పెళ్లైన 13 రోజులకే.. సామ్‌బాంబే తనని శారీరకంగా హింసిస్తున్నారని పనాజీ పోలీసులను ఆమె ఆశ్రయించి వైరల్ అయింది. ఆమె ఫిర్యాదు మేరకు సామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment