వీరాపూర్‌కు మళ్లిన పులి..
● ఓ కుంట వద్ద నీరు తాగినట్లు గుర్తించిన అధికారులు
కాటారం: కాటారం, మహదేవపూర్ రేంజ్ పరిధిల్లో పన్నెండు రోజులుగా సంచరిస్తున్న పులి రోజుకు ఓ ప్రాంతంలో ఆనవాళ్లు వదిలేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఈ నెల 10న కాటారం మండలం నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్న పెద్ద పులి.. కాటారం, మహదేవపూర్ రేంజ్ పరిధిల్లోని పలు అటవీ ప్రాంతాలను చుట్టి వేస్తోంది. మూడు రోజుల క్రితం పల్గుల అటవీ ప్రాంతంలో కనిపించిన పులి.. తాజా శుక్రవారం రాత్రి కాటారం మండలంలోని వీరాపూర్ అటవీ ప్రాంతానికి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. గాలింపు చర్యల్లో భాగంగా అటవీశాఖ బృందం వీరాపూర్ అటవీ ప్రాంతంలోని ఓ కుంట వద్ద పులి నీరు తాగినట్లు పాదముద్రలను (ప్లగ్ మార్క్) గుర్తించారు. అక్కడి నుంచి తిరిగి నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు ఆనవాళ్లు ఉన్నాయని వారు పేర్కొన్నారు. దీంతో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న వీరాపూర్, ఒడిపిలవంచ, గుమ్మాళ్లపల్లి, నస్తూర్‌పల్లి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, కాటారం మండలం గుండ్రాత్‌పల్లిని ఆనుకుని ఉన్న గోదావరి దాటి చెన్నూర్ వైపు గల కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి చేరుకునేందుకు పులి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సరైన మార్గం దొరకకపోవడంతో ఇక్కడిక్కడే తచ్చాడుతున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండు సార్లు ఈ ప్రాంతంలో పులి సంచరించినప్పటికీ ఎప్పుడూ ఇన్ని రోజులు ఉన్న దాఖలాలు లేవని వారు పేర్కొంటున్నారు. కాగా, ఇన్ని రోజులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్న పులి ఎలాంటి దాడులకు పాల్పడకపోవడంపై ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఎద్దును చంపిన పులి
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం పలుగుల అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఎద్దుపై పెద్దపులి దాడి చేసి చంపి తిన్నది. శనివారం బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 18వ తేదీన తన ఆవులతో పాటు ఎడ్లు మేతకు అడవికి వెళ్లాయన్నారు. మేతకు వెళ్లిన గోవుల్లో ఓ ఎద్దు ఇంటికి రాలేదన్నారు. అదే రాత్రి పెద్దపులి అడవిలోకి వచ్చిందని గ్రామస్తులు తెలపడంతో ఆచూకీ కోసం అడవిలోకి వెళ్లలేదని, పులి పలుగుల నుంచి బీరాసాగర్, నస్తుర్‌పల్లి అడవిలోకి వెళ్లినట్లు సమాచారం తెలిసిందన్నారు. దీంతో శనివారం తెల్లవారు జాము నుంచి అడవిలో వెతకగా ఎద్దు కళేబరం కనిపించినట్లు తెలిపారు. మృతిచెందిన ఎద్దు విలువ రూ.35వేల వరకు ఉంటుందన్నారు, కాగా, ఎద్దు వెనుక భాగాన్ని పులి పూర్తిగా తిన్నది. పెద్దపులి సంచారంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మృతిచెందిన ఎద్దును అటవీశాఖ సిబ్బంది పరిశీలించారు. ఎఫ్‌ఎస్‌ఓ ఆనంద్‌ను వివరణ కోరగా పులి ఎద్దును తిన్నది నిజమే అని, వెటర్నరీ వైద్యులు ఆదివారం వచ్చి పరిశీలిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment