వినియోగదారులతో సీఎండీ ముఖాముఖి
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులతో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. మంగళవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి విద్యుత్ వినియోగదారులతో ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడారు. నూతనంగా సర్వీస్‌లు పొందిన గృహ, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల వినియోగాదారులకు స్వయంగా ఫోన్ చేసి వారితో సంభాషించారు. సర్వీస్ మంజూరు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కొత్త సర్వీస్ మంజూరులో జాప్యం జరిగిందా? కాల పరిమితికి లోబడి మంజూరు చేశారా? విద్యుత్ అధికారులు నిబంధనల మేరకు మంజూరు చేస్తున్నారా? అధికారులు ఎలా పని చేస్తున్నారు? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ఇతర సేవలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరుణ్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడానికి వినియోగదారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు నేరుగా వారితో మాట్లాడానన్నారు. ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా అవసరమైన మార్పులు తీసుకొచ్చే అవకాశముందన్నారు. అదే విధంగా సత్సంబంధాలు పెరుగుతాయన్నారు. వినియోగదారుల్లో కంపెనీపై విశ్వాసం, సేవల పట్ల నమ్మకం కలుగుతుందన్నారు. వినియోగాదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి ప్రతీ ఉద్యోగి నిబద్దతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment