ఈఆర్‌సీకి సమస్యల గోడు
హన్మకొండ: విద్యుత్ నియంత్రణ మండలికి వినియోగదారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సవరణ చేయబడిన రిటైల్ సప్లయ్ వ్యాపారానికి సమగ్ర ఆదాయ ఆవశ్యకత, ధరలు, క్రాస్ సబ్సిడీ సర్ చార్జీల ప్రతిపాదనలపై విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ ఆధ్యక్షతన బహిరంగ విచారణ జరిగింది. ఈ విచారణలో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి.. సంస్థ ద్వారా వినియోగాదారులకు అందిస్తున్న సేవలు వివరించారు. విద్యుత్ చార్జీలు పెంచడం లేదని చెప్పారు. ఆధునిక సాంకేతికను వినియోగించి వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఎన్పీడీసీఎల్‌లో అమలు చేస్తున్న సాంకేతిక పద్ధతులు, సంస్థను వినియోగదారులకు చేరువ చేసిన విధానాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
బాధితులకు ఈఆర్‌సీ చైర్మన్ చేతుల మీదుగా చెక్కు అందజేత..
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదురుగడ్డకు చెందిన అంగిడి అనిత, రాజ్ కుమార్ దంపతుల ఇల్లు విద్యుదాఘాతంతో దగ్ధమైందని, ఈ ఘటనలో వారి కుమారుడు సాయి కుమార్(07) చనిపోయాడని, ఇంటి పైనుంచి విద్యుత్ లైన్ వెళ్లడం ద్వారానే ఈ ఘటన జరిగిందని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధి జోగినిపల్లి సంపత్‌రావు ఈఆర్‌సీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులను ఈఆర్‌సీ ముందుంచి వారి బాధను వివరించారు. ఈ ఘటన జరిగి 5 నెలలవుతున్నా ఎలాంటి పరిహారం చెల్లించలేదని తెలిపారు. స్పందించిన ఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ పరిహారం చెల్లించాలని సూచించారు. దీంతో బహిరంగా విచారణ సభలోనే ఈఆర్‌సీ చైర్మన్ చేతుల మీదుగా బాధితులు అనితా, రాజ్‌కుమార్ దంపతులకు రూ.5 లక్షల చెక్కు అందించారు.
సీజీఆర్‌ఎఫ్ సేవలు విస్తృతం చేయాలి..
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్) సేవలను మరింత విస్తృతం చేయాలని ఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అధికారులకు సూచించారు. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. విద్యుత్ వినియోగదారులకు అందిస్తున్న సేవలకు ఎన్పీడీసీఎల్ యాజమాన్యాన్ని అభినందించారు.
విద్యుత్ చార్జీలు పెరగవు..
టీజీ ఎన్పీడీసీఎల్ రెవెన్యూ లోటు రూ.10,393 కోట్లు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నిర్వహణకు రూ.19,814 కోట్ల ఆదాయం అవసరం కాగా, రూ.9,421 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంతో రెవెన్యూ భారీ లోటు ఏర్పడనుంది. ప్రభుత్వం ఈ మేరకు రీయింబర్స్ చేయాల్సిన అవసరముంది. అదే విధంగా ఈ సంవత్సరం విద్యుత్ చార్జీల టారిఫ్ పెంపుపై ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. దీంతో విద్యుత్ చార్జీలు పెరగవు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి భారం పడదు.
చైర్మన్‌కు వివరించిన విద్యుత్ వినియోగదారులు
సీజీఆర్‌ఎఫ్ సేవలు ప్రజల్లోకి
విస్తృతంగా తీసుకెళ్లాలి
ఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ దేవరాజ్ నాగార్జున్
వినియోగదారుల సమస్యల
పరిష్కారానికి ప్రాధాన్యం
టీజీ ఎన్పీడీసీఎల్
సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
ఈఆర్‌సీకి సమస్యల గోడు
Comments
Please login to add a commentAdd a comment