మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా మిర్చి వస్తోంది. బస్తాలతో యార్డు నిండిపోవడంతో మార్కెట్ ప్రధాన ద్వారానికి తాళంవేసి క్రమక్రమంగా వాహనాలను సిబ్బంది లోనికి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ స్థలం రైతుల అవసరాలకు సరిపోవడం లేదు. మిర్చి అధికంగా వచ్చినప్పుడు కొనుగోళ్లు బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించి మార్కెట్ రేటుతో సంబంధం లేకుండా ధర తగ్గిస్తున్నారు. అటు తక్కువ ధరకు ఆమ్ముకోలేక ఇటు తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌లో మిర్చి కొనుగోలు చేసే వ్యాపారులే బయట ధరలు తగ్గించి రైతులను మోసం చేయడం గమనార్హం. ఈ తతంగం అంతా తెలిసిన అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
6,727 బస్తాల మిర్చి కొనుగోళ్లు..
వ్యవసాయ మార్కెట్ పరిధిలో బుధవారం తేజ రకం, తాలు రకం మొత్తంగా 6,727 బస్తాల మిర్చి కొనుగోళ్లు జరిగాయి. తేజ రకం 6,177 బస్తాలు (2,477 క్వింటాళ్లు), తాలు రకం 550 బస్తాలు (220 క్వింటాళ్లు)కొనుగోలు చేయగా తేజ రకం గరి ష్ట ధర క్వింటాకు రూ.13,639 పలుకగా కనిష్ట ధర రూ.9,500 పలికింది. తాలు రకం గరిష్ట ధర క్వింటాకు రూ.6,350 పలుకగా, కనిష్ట ధర రూ.5,020 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.
రైతులు మిర్చి తీసుకురావద్దు...
వ్యవసాయ మార్కెట్ యార్డుకు అధికంగా మిర్చి రావడం వల్ల అన్ని షెడ్లు నిండి ఖాళీ స్థలం లేదని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం 6,500 బస్తాలు బిడ్డింగ్, కాంటా కావాల్సి ఉందని, రోజుకు ఏడు వేల బస్తాల వరకు మిర్చి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా మార్కెట్ యార్డులో గురు, శుక్రవారాల్లో కొనుగోళ్లు జరిపేందుకు 15 వేల మిర్చి బస్తాలు వచ్చి ఉన్నాయని, మొత్తం 21,500 మిర్చి బస్తాలు వచ్చాయని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో ఖాళీ స్థలం లేనందున బయట నుంచి యార్డులోకి మిర్చిని అనుమతించమని తెలిపారు. రైతులు తమ మిర్చిని తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.
యార్డుల్లో నిండిన బస్తాలు
స్థలం సరిపోక రైతుల ఇబ్బందులు
మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి
Comments
Please login to add a commentAdd a comment