ఆరోగ్యం కాపాడుకుంటూ విధులు నిర్వర్తించాలి
హన్మకొండ: వేసవిలో ఆరోగ్యం కాపాడుకుంటూ విధులు నిర్వర్తించాలని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను డిపో మేనేజర్లు, సిబ్బందికి సూచించారు. శనివారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలోని 9 డిపోల మేనేజర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సమ్మర్ చాలెంజ్‌ను విజయవంతంగా నిర్వహించాలన్నారు. డీహైడ్రేషన్ నివారణకు రోజు తగిన మోతాదులో నీరు, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీరు తీసుకోవాలన్నారు. విధులు ముగిసిన తర్వాత తగిన విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఎలాంటి లీవ్‌లు, సిక్ లీవ్‌ల్ తీసుకోని, గైర్హాజర్ కాకుండా డ్యూటీలకు హాజరైన వారికి ప్రోత్సాహాలు అందించనున్నట్లు చెప్పారు. మార్చి నుంచి జూన్ మాసాంతం వరకు మరింత శ్రద్ధతో పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తూ డిపోల ఆర్థికాభివృద్ధికి, తద్వారా రీజియన్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ కె.భానుకిరణ్, అకౌంట్స్ ఆఫీసర్ రవీందర్ రావు, డిపోల డిపో మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.
ఆర్టీసీ వరంగల్ ఆర్‌ఎం డి.విజయ భాను
Comments
Please login to add a commentAdd a comment