మహంకాళి దేవాలయ భూమిపై వివాదం
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండల కేంద్రంలోని మహంకాళి దేవాలయ భూమిపై వివాదం నెలకొంది. కబ్జాకు గురైన ఆలయ భూమిని స్వాధీనం చేసుకుని హద్దులు నిర్ధారించాలని స్థానికులు సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, తమ భూమిలో నిర్మాణాలు చేపట్టడానికి యత్నిస్తుండగా కొంతమంది అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వల్లాల జగన్ అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. ఫిర్యాదుపై విచారణ జరుపుతామన్నారు. వివరాలు ఉన్నాయి. మండల కేంద్రంలో పురాతన మహంకాళి ఆలయం ఉంది. గతంలో ఈ ఆలయంలో అమ్మవారికి దీపదూప నైవేద్యాలు సమర్పించేవారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆలయం పూజలకు నోచుకోలేదు. ఇదే అవకాశంగా భావించిన ఆలయం పక్క ఉన్న జగన్ సోదరులు ఇక్కడ కట్టెల మండీ ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెప్పారు. ఇది కొన్నాళ్లు కొనసాగుతూ వచ్చింది. అయితే ఆరేళ్ల క్రితం స్థానిక పద్మశాలి సేవా సంఘం మహంకాళి ఆలయం ఉన్నట్లు వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో జగన్‌కు స్థానికుల మధ్య వివాదం నెలకొంది. ఈ విషయంలో అప్పుడు కార్పొరేటర్‌గా పనిచేసిన నాగమళ్ల ఝాన్సీ భర్త నాగమళ్ల సురేశ్ ఇరువురితో మాట్లాడి సమస్యను సద్దుమణిగించారు. అయితే వారం రోజులుగా మళ్లీ వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పిట్టల కుమారస్వామి, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్ పంచాయితీ చేశారు. అది కొలిక్కి రాలేదు. చివరికి పంచాయితీ వాయిదా పడింది. కాగా, సోమవారం స్థానికులు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేయగా, జగన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కబ్జా చేశారని స్థానికులు కలెక్టర్‌కు.. చేయలేదని మరోవర్గం పీఎస్‌లో ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment