
పోలీసు వ్యవస్థపై విశ్వాసం పెంపొందించాలి
మహబూబాబాద్ రూరల్: పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజల్లో పోలీ సు వ్యవస్థపై విశ్వాసం పెంపొందించాల్సిన అవసరం ఉందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్ సమావేశ మందిరంలో మంగళవారం కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. న్యాయ సంబంధిత విధుల్లో నిర్లక్ష్యం సరికాదని, ప్రతీ కేసు విచారణలో చార్జిషీట్‌ను నిర్దేశిత కాలవ్యవధిలో న్యాయస్థానాలకు సమర్పించాలని ఆదేశించారు. అలాగే కోర్టు విచారణకు సంబంధించి సాక్షుల హాజరును నిర్ధారించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయాన్ని మెరుగుపర్చుకొని కేసుల పరిష్కార వేగాన్ని పెంచాలన్నారు. అనుమానితులను న్యాయస్థానాలకు తరలించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి భద్రతాలోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు డ్యూటీలలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్ష