
విద్యుత్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
హన్మకొండ : ఈదురుగాలులు, భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో 16 సర్కిళ్ల పరిధిలో ప్రతీ అధికారి, ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఈదురుగాలులకు చెట్లు విరిగి లైన్లు తెగిపడి ట్రిప్పింగ్స్, బ్రేక్ డౌన్స్ జరిగిన వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పడు తమ సర్కిల్ పరిధిలోని సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కు చేరవేయాలని, అక్కడి నుంచి కార్పొరేట్ ఆఫీస్‌కు సమాచారం అందించాలన్నారు. కావాల్సిన మెటీరియల్ అందుబాటలో ఉంచామని, ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఎక్కువ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లో ఎక్కువ ఈదురుగాలులు, భారీ వర్షాలు పడుతాయని, ఎస్‌ఈలు ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా మానిటర్ చేస్తూ, మెన్, మెటీరియల్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డైరెక్టర్ టి.మధుసూదన్, సీఈలు రాజుచౌహాన్, అశోక్, 16 సర్కిళ్ల ఎస్‌ఈలు పాల్గొన్నారు.