
నేడు ఉరకలెత్తి
నాడు పిడికిలెత్తి..
ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లులో రజతోత్సవ సంబురం
● ‘తెలంగాణ’కు ఊపిరిలూదిన ఓరుగల్లు
● కాకతీయుల గడ్డపై స్వరాష్ట్ర సాధన ఉద్యమం
● ఉద్యమ పార్టీగా ఆదరణ..
25 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు
● తెలంగాణ సాధనలో
వరంగల్‌దే కీలక భూమిక
● ఓరుగల్లులో బీఆర్‌ఎస్ ఉద్యమ ప్రస్థానం
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీ(టీ)ఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పురుడుపోసుకున్న ఉద్యమం ఓరుగలుల్లో ఉవ్వెత్తున ఎగిసింది. పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తున్న చారిత్రక ఓరుగల్లు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమానికి ఊపిరులూదింది. వరంగల్ ఉద్యమ నేపథ్యం, స్ఫూర్తిని పదేపదే ప్రస్తావించే ఉద్యమనేత, మాజీ సీఎం కేసీఆర్.. 25 ఏళ్ల పార్టీ రజతోత్సవ సభకు ఇక్కడే వేదిక చేశారు. చారిత్రక వరంగల్ మరోసారి కీలక గులాబీ జెండా పండుగకు వేదికై ంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావం, ఓరుగల్లు పోరు, ఉద్యమ ప్రస్థానం, రాష్ట్రసాధన తదితర అంశాలు గుర్తుకు వస్తున్నాయి.
ఓరుగల్లులో ఇదీ పార్టీ ప్రస్థానం... వరుస సభలు.. రగిలిన ఉద్యమం..
హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో మొదటి భారీ బహిరంగ సభ 2001 జూన్ 21న జరిగింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2002 అక్టోబర్ 28న భూపాలపల్లిలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. 2003 ఏప్రిల్ 27న వరంగల్ జైత్రయాత్ర పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించగా.. మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవగౌడ, అప్పటి కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి అజిత్‌సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సభ సందర్భంగా ఒక్కరోజు ముందు సిద్దిపేట నుంచి వరంగల్ వరకు 100 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 2003 అక్టోబర్ 22న మేడారంలో పల్లెబాట కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించారు. 2003 డిసెంబర్ 5న జనగామలో ఓరుగల్లు వీరగర్జన బహిరంగ సభ నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులు రాజీనామా చేసిన తర్వాత 2005 జూలై 17 వరంగల్‌లో మొదటి సభ, భారీ బహిరంగ సభ నిర్వహించగా అప్పటి కేంద్ర మంత్రి శరద్‌పవార్ హాజరయ్యారు. 2007 ఏప్రిల్ 27 తెలంగాణ విశ్వరూప మహాసభ పేరుతో టీఆర్‌ఎస్ ఆరో వార్షికోత్సవం జరిగింది.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో
2009 నవంబర్ 23న కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల జేఏసీ బహిరంగ సభ, 14 విద్యార్థి సంఘాలతో సమావేశం, స్వరాష్ట్రం కోసం ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో నినాదం’ ప్రకటన చేశారు. 2010 సెప్టెంబర్ 3న పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో టీఆర్‌ఎస్ బహిరంగ సభ జరిగింది. 2010 డిసెంబర్ 16న తెలంగాణ మహాగర్జన పేరుతో నగరంలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ఆర్య సమాజ్ అధ్యక్షుడు స్వామి అగ్నివేశ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగ సభగా రికార్డు అయింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడగా.. 2017 ఏప్రిల్ 27న నగరంలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తాజాగా, బీఆర్‌ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సభ కూడా ఇక్కడే నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల సభలు, విజయోత్సవ సభలు.. పాతికేళ్లలో ఒడిదుడుకులు..
తెలంగాణ సాధన ఉద్యమ సభలతోపాటు ఎన్నికలు, విజయోత్సవ సభలకు ఓరుగల్లు వేదికై ంది. 2004 సాధారణ ఎన్నికల్లో వరంగల్, హనుమకొండ లోక్‌సభ స్థానాలతోపాటు హనుమకొండ, స్టేషన్‌ఘన్‌పూర్, చేర్యాల, నర్సంపేట, పరకాల, చెన్నూరు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఈ సందర్భంగా కేసీఆర్ పలుచోట్ల సభలు నిర్వహించారు. 2008 జూన్ 1న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడగా హనుమకొండ లోక్‌సభ, చేర్యాల స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలిచింది. 2009 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలవగా, 2010 ఫిబ్రవరి 7న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారంలో కేసీఆర్ పాల్గొనగా అభ్యర్థి గెలిచాడు. 2012లో స్టేషన్‌ఘన్‌పూర్ ఉపఎన్నిక ప్రచారంలో కేసీఆర్ పాల్గొనగా టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. 2014 సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం.. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ.. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ స్థానాల్లో టీ(బీ)ఆర్‌ఎస్ విజయం దక్కింది. 2015 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచారు. 2015 నవంబర్ 24న వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల రికార్డు మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2015 డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 2016 మార్చి 9న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 58 డివిజన్లలో 44 స్థానాలను పార్టీ గెలుచుకుంది. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లోని 11 స్థానాల్లో గెలవగా, 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో విజయం సాధించారు. 2019 మేలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఆరు జెడ్పీలు, 98 శాతం ఎంపీపీలు గెలవగా, 2019 జూన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఘనవిజయం సాధించారు. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో గెలవగా, 2021 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాల్లో రెండే స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకుంది.
ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఇక్కడినుంచే..
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు వరంగల్ అంటే ప్రత్యేక అభిమానం. ఇక్కడినుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది సక్సెస్ అవుతుందన్న నమ్మ కం ఆయనది. కాకతీయుల ఏలుబడి.. సమ్మక్క–సారక్కల పోరాట తెగువ.. కాళోజీ నారాయణ రావు, ఆచార్య జయశంకర్‌లను స్ఫూర్తిగా చెప్పుకుంటారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల తెగువను తరచూ ప్రస్తావిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన బీ(టీ)ఆర్‌ఎస్.. 14 ఏళ్ల ఉద్యమ సమయంలో పడుతూ లేస్తూ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. పడినప్పుడ ల్లా లేచేందుకు పురుడుపోసుకున్న ఆలోచనలతో ఉద్యమం ఓరుగలుల్లో ఉవ్వెత్తున ఎగిసింది. ఉద్యమాలకు కేరాఫ్.. పోరాటాల ఖిల్లాగా ఉన్న చారి త్రక వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్‌లో కీలక ఘట్టాలకు వేదికై ంది. అందుకే పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే ప్రతీ కార్యక్రమం ఓరుగల్లు నుంచే మొదలెట్టడం కేసీఆర్‌కు రివాజుగా మారింది. ఇదే క్రమంలో బీ ఆర్‌ఎస్ సిల్వర్‌జూబ్లీ వేడుకలకు మరోసారి ఓరుగల్లును వేదికగా మార్చుకున్నారన్న చర్చ ఉంది.

నేడు ఉరకలెత్తి

నేడు ఉరకలెత్తి