
డిమాండ్ ఉన్న పంటల సాగుపై దృష్టి
బయ్యారం: రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల సాగుపై దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమలశాఖ అధికారి జినుగు మరియన్న సూచించారు. మండలంలోని బయ్యారం, బాలాజీపేట, ఇర్సులాపురం గ్రామాల పరిధిలో సాగు చేసిన ఆయిల్‌పామ్, మామిడి, కూరగాయల పంటలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. రైతులు కూరగాయలు, పూలసాగు చేయడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. మూడు సంవత్సరాలలోపు ఉన్న ఆయిల్‌పామ్ మొక్కలోని పూగుత్తులను నెలకు ఒకసారి, అబ్లేషన్ సాధనంతో రెండుసార్లు తొలగించాలన్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోటా, సీతాఫలం, పనస, నేరేడు, అవకాడో మొక్కలకు మల్చింగ్, బిందు సేద్యం ద్వారా నీరు ఇవ్వాలన్నారు. ఆయన వెంట ఆయిల్‌ఫెడ్ మానిటరింగ్ అధికారి కరుణాకర్, ఆయిల్‌ఫెడ్ ఫీల్డ్ అధికారులు చంద్రప్రకాశ్, శ్రీకాంత్, రైతులు అప్పారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.