
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
కాళేశ్వరం: పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాన్‌సాయిపేటకు చెందిన కుడుదుల అనిల్(21) పల్సర్ బైక్‌పై కాళేశ్వరం వస్తుండగా.. అన్నారం మూలమలుపు వద్ద కిందపడి తలకు తీవ్రగాయాలై మృతి చెందాడు. అనిల్ మూలమలుపు వద్ద పడగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆ యువకుడిని ఏదైనా వాహనం ఢీకొట్టిందా? లేక అదుపు తప్పి బైక్‌పై నుంచి పడి మృతి చెందాడా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి ఫోన్ ఆధారంగా అతడిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
వర్ధన్నపేట: చనిపోయిన దున్నపోతును చూద్దామని రోడ్డుపైకి వెళ్లిన ఓ వృద్ధురాలిని అతి వేగంతో వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రగాయాలై చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన రడపాక కొమురమ్మ(59) ఇల్లంద గ్రామ కమ్యూనిటీ హాల్‌లో నివాసం ఉంటోంది. శుక్రవారం ఉదయం జాతీయ రహదారిపై దున్నపోతు చనిపోయి ఉండడంతో చూడడానికి రోడ్డుపైకి వచ్చిన కొమురమ్మను ఖమ్మం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం అతి వేగంతో ఢీకొట్టి వెళ్లిపోయింది. స్థానికులు కొమురమ్మను 108 ద్వా రా వరంగల్ ఎంజీంకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి మనవడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వర్ఘన్నపేట ఎస్సై రాజు తెలిపారు.
శుభకార్యానికి వెళ్లొస్తుండగా..
మహబూబాబాద్ రూరల్: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం వేపచెట్టు తండాకు చెందిన హలావత్ మోహన్ (31) మహబూబాబాద్ మండలం అమంగల్ లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మోహన్ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామ పరిధిలో తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి ఈనెల 23న వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గురువారం రాత్రి బైక్‌పై మహబూబాబాద్ మీదుగా ఇంటికి వెళ్లేందుకు బయల్దేరాడు. ఈక్రమంలో మోహన్ ద్విచక్ర వాహనం మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామ శివారు మీదుగా వెళ్తుండగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈప్రమాదంలో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై వి.దీపిక తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి