
ప్రభుత్వానిది అవగాహనారాహిత్యం
ఎల్కతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో రాష్ట్రంలో వ్యవసాయం కుంటుపడేలా చేస్తోందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపంలో ఈనెల 27న నిర్వహించబోయే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో అద్భుత సభలు నిర్వహించిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీదే అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్‌లో నిర్వహించిన సింహగర్జన మొదలు.. నేటి రజతోత్సవ సభ వరకు ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్న నేత కేసీఆర్ అన్నారు. ఎల్కతుర్తిలో నిర్వహించబోయే సభ దేశ చరిత్రలో నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందన్నారు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దితే అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల్లో తెలంగాణను అధోగతిపాలు చేస్తోందని విమర్శించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో భూములు కొల్లగొట్టే ప్లాన్ చేశారని, ధరణి పేరు మార్చి భూ భారతి అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ మారపెల్లి సుధీర్‌కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, ఇన్‌చార్జ్‌లు భరత్‌కుమార్‌రెడ్డి, నాగుర్ల వెంకన్న, నాయకులు ఎల్తూరి స్వామి, వేముల శ్రీనివాస్, సమ్మయ్య, జడ్సన్ చిట్టిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి