
సన్న బియ్యం.. జైకొట్టి
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం సరఫరా చేస్తోంది. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో అన్నం ముద్దగా ఉందని, తింటే అరగడం లేదని ఇబ్బంది పడిన పేదలు ఇప్పుడు సన్న బియ్యం అనగానే పోటీపడి మరీ తీసుకెళ్తున్నారు. దీంతో గత నెలతో పోలిస్తే ఈ నెల కోటా అధికంగా బియ్యం పంపిణీ చేసినట్లు అధి కారులు చెబుతున్నారు. అయితే గతంలో బియ్యం తీసుకెళ్లిన వారిలో ఎక్కువ మంది తినేవారు కాదు. ఇప్పుడు మాత్రం తినేందుకే తీసుకెళ్తున్నామని లబ్ధిదారులు చెప్పడం గమనార్హం.
పోటాపోటీగా..
ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేయడంతో రేషన్ కార్డుదారులు బియ్యం తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఇలా జిల్లాలోని 556 రేషన్ షాపుల ద్వారా ఆహార భద్రతాకార్డులు, అంత్యోదయ, అన్నపూర్ణ మొత్తం 2,41,012 కార్డుల్లోని 7,03,550 మందికి నెలకు 4,511 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. మార్చి నెలలో 1,65,107 రేషన్ కార్డులపై 3,254 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. అంటే గత నెల 68.51శాతం లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకెళ్లారు. అదే ఏప్రిల్ నెలలో 4,602 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం రేషన్ షాపులకు సరఫరా చేయగా.. తెల్లరేషన్ కార్డులు ఉన్న 1,84,089 కుటుంబాలు 3,691మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకెళ్లారు. అంటే ఈనెల 80.21శాతం బియ్యం పంపిణీ చేశారు. గత నెల కంటే ఈనెల 11.7శాతం అధికం సరఫరా చేశారు.
బియ్యం వ్యాపారుల ఢీలా..
ప్రతీ నెల దొడ్డుబియ్యం రావడంతో పేదల వద్ద నుంచి కిలో రూ.7నుంచి రూ.10 వరకు కొనుగోలు చేసి రూ.14 రూపాయలకు పైగా కిలో చొప్పున పెద్ద వ్యాపారికి, రైస్ మిల్లుల యజమానులకు విక్రయించేవారు. వారు దొంగచాటున బస్తాలు మార్చి బీరు షాపులు, కోళ్ల పరిశ్రమ, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడం, కొందరు మిల్లర్లు ఈ బియ్యాన్నే సీఎంఆర్‌గా పెట్టి పట్టుబడిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. అయితే ఈ నెల సన్నబియ్యం ఇవ్వడంతో బయట మార్కెట్‌లో కిలో రూ.50కి పైగా పలుకగా.. వీటిని అమ్ముకునేందుకు లబ్ధిదారులు ఎవరూ ముందుకు రావడంలేదు. నూకను వేరు చేసి వండుకోవడం, కొద్దిరోజులు మాగపెట్టి వండుకునేందుకు నిల్వ చేసుకుంటున్నారు. దీంతో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులకు బియ్యం దొరకడం లేదు. అలాగే సాధారణ బియ్యం వ్యాపారుల సేల్స్ కూడా భారీగా తగ్గాయి.
రేషన్ బియ్యం పంపిణీ ఇలా.. (మెట్రిక్ టన్నులు)
నెల మొత్తం కార్డులు తీసుకున్న కార్డులు సరఫరా పంపిణీ శాతం
మార్చి 2,41,012 1,65,107 4,511.62 3,254.64 68.51
ఏప్రిల్ 2,41,012 2,20,543 4,602.16 3,691.71 80.21
అదనంగా 50 క్వింటాళ్లు
పంపిణీ చేశా
ప్రతీ నెల నాకోటా కింద 86 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తా. కొన్ని సార్లు బియ్యం తీసుకునేందుకు ఎక్కువ మంది రాకపోవడంతో 50 క్వింటాళ్లు కూడా పంపిణీ కాని సందర్భాలు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో నాకోటా పోగా అదనంగా 50 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేశా. సన్నబియ్యం కావడంతో పేదలు సంబురంగా తీసుకెళ్తున్నారు.
–రామచందర్‌రావు, డీలర్,
వెంకటేశ్వర బజార్, మహబూబాబాద్
మంచి స్పందన వచ్చింది
ఏప్రిల్ నెలలో అన్ని రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేశాం. సన్న బియ్యం తీసుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా షాపుల వద్దకు వచ్చారు. జిల్లాలోని కార్డుదారులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ బియ్యం తీసుకున్నారు. పేదలు తినేందుకు అనువుగా బియ్యం ఉండడంతో అమ్ముకునేందుకు కూడా ముందుకు రారు.
–ప్రేమ్ కుమార్, డీఎస్‌ఓ, మహబూబాబాద్
తినేందుకే తీసుకెళ్లాం..
పోయిన నెల దొడ్డు బియ్యం ఇస్తే అవి వండాలంటే ఇబ్బంది పడేవాళ్లం. ముద్ద అన్నం, ఏ కూర వేసుకొని తిన్నా రుచీ పచీ ఉండేది కాదు. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారు. కారం ఏసుకొని తిన్నా రుచిగానే ఉంటుంది. అందుకోసమే సన్నబియ్యం ఇస్తున్నారు అని తెలియగానే తీసుకెళ్లాను.
–కొమ్ము ఉప్పలమ్మ, చిన్నగూడూరు
మరింత నాణ్యమైనవి సరఫరా చేయాలి
ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తే మంచిదే. కానీ ప్రస్తుతం ఇస్తున్న సన్న బియ్యంలో నూక ఎక్కువగా ఉంది. అన్నం వండితే ముద్ద అవుతుంది. మరింత నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేస్తే పేదలకు ఉపయోగ పడుతుంది. పాలిష్ ఎక్కువ పెట్టిన బియ్యం సరఫరా చేయడంతో అన్నం పగులుతుంది. వచ్చే నెల నుంచి మంచి బియ్యం ఇవ్వాలి.
–తీగల రాజు, గుర్తూరు
పోటీపడి తీసుకెళ్లిన లబ్ధిదారులు
గత నెల కన్నా అధికంగా పంపిణీ
హర్షం వ్యక్తం చేస్తున్న పేదలు

సన్న బియ్యం.. జైకొట్టి

సన్న బియ్యం.. జైకొట్టి

సన్న బియ్యం.. జైకొట్టి

సన్న బియ్యం.. జైకొట్టి