
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా అదనపు కలెక్టర్ వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నా రు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. పరిష్కారం సాధ్యం కాకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. ఆ వినతుల గడువులోపే పరిష్కరించి ప్రజలకు నమ్మకం కల్పించాలన్నారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అవినీతికి పాల్పడుతున్నారని, వెంటనే విచారణ చేయాలని మానుకోట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మట్టూరి నాగేశ్వర్‌రావు వినతి పత్రం అందజేశారు. విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీని రద్దు చేసి గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజావాణిలో 63 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, తొర్రూరు ఆర్డీఓ గణేశ్, సీపీఓ సుబ్బారావు, డీపీఓ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
ప్రజావాణిలో 63 వినతులు