
రన్నింగ్ రూంలో సకల సదుపాయాలు
● ఏడీఆర్‌ఎం గోపాలకృష్ణన్
డోర్నకల్: డోర్నకల్ రైల్వే జంక్షన్ పరిధిలో ఏర్పాటు చేసిన రన్నింగ్ రూంలో లోకో పైలెట్లు, ట్రైన్ మేనేజర్ల కోసం సకల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ ఏడీఆర్‌ఎం (ఆపరేషన్స్) ఆర్. గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం నిర్వహించిన త్రైమాసిక సమావేశం సందర్భంగా రన్నింగ్ రూంలోని వసతులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఆర్‌ఎం మాట్లాడుతూ లోకో పైలెట్లు, ట్రైన్ మేనేజర్లు, అసిస్టెంట్ లోకోపైలట్లతో కూడిన రన్నింగ్ సిబ్బంది సురక్షిత ఉద్యోగ నిర్వహణ కోసం రన్నింగ్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైల్వే మార్గంలో 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఒకటి చొప్పున సికింద్రాబాద్ డివిజన్‌లో 22 రన్నింగ్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విధుల్లో భాగంగా దూరప్రాంతాల నుంచి వచ్చే రన్నింగ్ సిబ్బంది ఇక్కడ సేదదీరేందుకు ఏసీ గదులు, రుచికర ఆహారం, యోగా, రీడింగ్ రూంతోపాటు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, డోర్నకల్‌లో పలు రైళ్ల హాల్టింగ్‌కు సంబంధించి తమకు ప్రతిపాదనలు అందాయని వీటిని పరిశీలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కోసురు చైతన్య, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ చరణ్‌నాయక్, స్టేషన్ సూపరింటెండెంట్ శోభన్‌ప్రసాద్, డీఆర్‌యూసీసీ సభ్యుడు ఖాదర్ పాల్గొన్నారు.