
రామప్ప కార్వింగ్స్ బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప కార్వింగ్స్ బ్యూటిఫుల్ అంటూ మిస్ వరల్డ్ ఇండియా కంటెస్టెంట్ నందిని గుప్తా కొనియాడారు. శనివారం సాయంత్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా టూరిజం అధికారి శివాజి, టూరిజం కార్పొరేషన్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసరావు ఆమెకు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. రామప్ప ఆలయంలో ఫొటో షూట్ నిర్వహించిన అనంతరం రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆమె పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్ ఆమెకు తీర్థప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు. టూరిజం గైడ్ విజయ్‌కుమార్ ద్వారా రామప్ప ఆలయ విశిష్టత తెలుసుకుంటా రామప్పలోని ప్రతి శిల్పాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సరిగమపలికే పొన్నచెట్టు శిల్పం, నీటిలో తేలాడే ఇటుకలను ఆసక్తిగా తిలకించారు. రామప్ప శిల్పకళా సంపద ధ్వంసం కావడానికి గల కారణాలను గైడ్‌ను అడిగి తెలుసుకున్నారు. మే 14న మిస్ వరల్డ్ కాంటెస్ట్ టీం సందర్శించనున్న నేపథ్యంలో రామప్ప ఆలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. మే 14 లోపు మరోసారి రామప్ప ఆలయాన్ని సందర్శిస్తానని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్ధార్ గిరిబాబు, ఎస్సై జక్కుల సతీష్, ఆర్‌ఐ విజేందర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మిస్ వరల్డ్ ఇండియా కంటెస్టెంట్
నందిని గుప్తా

రామప్ప కార్వింగ్స్ బ్యూటిఫుల్