
మహబూబ్‌నగర్: తాను అన్ని విధాలా చూసుకుంటున్నా తనను కాదని ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటుందన్న కోపంతో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నాడని జడ్చర్ల రూరల్ సీఐ జమ్ములప్ప తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మంగళవారం రాజాపూర్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. మండలంలోని పెద్దరేవల్లికి చెందిన మంజులకు మల్లేపల్లికి రాచమల్ల యాదయ్యతో వివాహమైంది.
అయితే గతంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్తలు రావడంతో మంజుల తన తల్లిగారి గ్రామమైన పెద్దరేవల్లిలో ఇల్లు కట్టుకుని తన కొడుకు శ్రీశైలంతో కలిసి జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన యాట చెన్నయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ మధ్యకాలంలో మంజుల ఇతరులతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటుందని అనుమానించిన చెన్నయ్య ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు మంజుల చెన్నయ్యకు ఫోన్ చేసి తనను బాలానగర్‌కు తీసుకెళ్లాలని కోరింది.
ఇదే అదునుగా భావించి చెన్నయ్య బైక్‌పై మంజులను ఎక్కించుకుని బాలానగర్‌కు తీసుకువెళ్లి షాపింగ్ చేసిన అనంతరం ఊరుబయటికి వెళ్లి కల్లు తాగుదామని నమ్మంచి అగ్రహారంపొట్లపల్లి శివారులో పెరుమాళ్లగుండు సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగిన తర్వాత ముందస్తు ప్లాన్ ప్రకారం రాళ్లతో తలపై కొట్టి చంపాడు. ఈ మేరకు మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ జమ్ములప్ప తెలిపారు. సమావేశంలో రాజాపూర్ ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.