
కూలిన ఇంటి మిద్దె, చిన్నారి వైష్ణవి (ఫైల్)
మహబూబ్‌నగర్: శిథిలావస్థకు చేరిన ఓ ఇంటి మట్టి మిద్దె కూలి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మద్దెల్‌బీడ్‌లో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన నర్సప్పకు భగవంతు, బస్వరాజు, అంజి అనే ముగ్గురు కుమారులు. అందరూ 30 ఏళ్లు క్రితం నిర్మించిన మట్టిమిద్దె ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. ఉదయం పత్తి ఏరే పని ఉండడంతో అందరూ పొలం వద్దకు వెళ్లారు.
ఇంటి వద్ద అంజి భార్య అనిత, బస్వరాజు కుమార్తె వైష్ణవి ఉన్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో కట్టె స్తంభంతో కూలడంతో అక్కడే ఆడుకుంటున్న వైష్ణవి, నర్సప్ప చిన్నకోడలు అనిత మట్టి మిద్దె కూలింది. దీంతో వారిద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. చుట్టుపక్కల వారు గమనించి.. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి, వెంటనే వారిని నారాయణపేట జిల్లాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. వైష్ణవి (3) మార్గమధ్యంలోనే మృతి చెందింది. అనిత చికిత్స పొందుతోంది.