మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో పార్టీ పెద్దలు మాణిక్‌రావు ఠాక్రే, జానారెడ్డి, చిన్నారెడ్డి మంతనాలు
సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఆపార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్త నేతలు పార్టీని వీడేందుకు మొగ్గు చూపుతుండటం ఆ పార్టీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గానూ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది.
అచ్చంపేట నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంశీకృష్ణ బరిలో నిలువనుండగా, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఇటీవల పార్టీలో చేరిన కొత్తవారికి అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ విషయంలో పార్టీ నిర్ణయం తీసుకోకపోతే వీడేందుకు సిద్ధమన్న సంకేతాలిచ్చారు.
అధిష్టానంపై ధిక్కారస్వరం..
అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 58 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను వెలువరించింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులకు ఈ జాబితాలో చోటు దక్కింది. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన వెంటనే టికెట్ ఆశించిన సీనియర్ నేతలు తమ ధిక్కార స్వరాన్ని వినిపించారు.
సోమవారం కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ వేదికగా మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, సీనియర్ నేత చింతలపల్లి జగదీశ్వరరావు పార్టీ అధిష్టానం తీరుపై మండిపడ్డారు. ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన వారిని కాదని అవకాశవాదులకు టికెట్ ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో స్వతంత్రుడిగానైనా బరిలో ఉంటున్నానని ఆయన తేలి్చచెప్పారు. పార్టీ ప్రకటించినఅభ్యర్థితో కలిసేది లేదని తేల్చి చెప్పారు.
మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి సైతం పార్టీ వీడేందుకు సిద్ధమన్న సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఆయన నేరుగా విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పోటీ విషయమై తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.
మలివిడత జాబితాపై సస్పెన్స్..
మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, వీటిలో కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి, షాద్‌నగర్‌లో కె.శంకరయ్యను అభ్యర్థులుగా ప్రకటించారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ టికెట్ కోసం పోటీ తీవ్రంగా కన్పిస్తోంది. ప్రధానంగా మక్తల్ నియోజకవర్గంలో వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి తనయుడు సిద్దార్థరెడ్డి, నాగరాజుగౌడ్ టికెట్ ఆశిస్తున్నారు.
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడి నుంచి డీసీసీ మాజీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ సైతం టికెట్ కోరుతున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో అనిరుద్‌రెడ్డికి టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది.
దేవరకద్ర నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు జి.మధుసుదన్‌రెడ్డి, టీపీసీసీ నాయకుడు కాటం ప్రదీప్‌కుమార్ గౌడ్, కొండా ప్రశాంత్‌రెడ్డి మధ్య పోటీ నెలకొంది. నారాయణపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, కుంభం శివకుమార్‌రెడ్డి టికెట్ కోసం పోటీపడుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించనున్న మలివిడత జాబితాలో అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాక ఆయా చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందోనన్నది ఉత్కంఠగా మారింది.
తేలేదెవరో.. మునిగేదెవరో..
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, సమయం మించిపోతున్న నేపథ్యంలో పలుచోట్ల కాంగ్రెస్ అభ్యర్థిత్వాలను ప్రకటించినా, టికెట్ ఆశించిన పెద్దనేతలు పార్టీని వీడుతుండటం హస్తం శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన సీనియర్ నేతలు చివరి నిమిషంలో తమ దారి తాము చూసుకుంటే ఎన్నికల్లో ఎవరికి నష్టం జరుగుతుందో, ఎవరికి మేలు జరుగుతుందోనన్న దిగులు నెలకొంది.
ఫలించని పెద్దల బుజ్జగింపులు..
నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కూచకుళ్ల రాజేశ్‌రెడ్డిని ప్రకటించిన వెంటనే నాగం జనార్దన్‌రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డితో కలసి సోమవారం హైదరాబాద్‌లోని నాగం ఇంటికి వెళ్లి చర్చించారు.
పార్టీ అగ్రనేత రాహుల్‌గాం«దీతో పాటు ఇతర పెద్దల దృష్టికి తీసుకెళ్తామని అంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకొవద్దని చెప్పినట్లు తెలిసింది. అనంతరం సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ అధిష్టానం తీరుపై నాగం ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థిగా కూచుకుళ్ల కుటుంబానికి ఎలాంటి అర్హత లేదని, తనను ఓటు అడిగే హక్కు వారికి లేదని వ్యాఖ్యానించారు.
Follow the Sakshi TV channel on WhatsApp:
ఇవి చదవండి: 'సార్ వద్దు.. నన్ను అలా పిలువు! నా కోరిక తీర్చవా? అంటూ మహిళా ఉద్యోగితో..
Comments
Please login to add a commentAdd a comment