వసతి గృహంలో అన్నం వండలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా
బల్మూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొండనాగుల ఎస్టీ బాలుర వసతి గృహంలో శివరాత్రి రోజు అన్నం వండలేదని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. నిరూపించకపోతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా.. అని మాజీమంత్రి కేటీఆర్‌కు అచ్చంపేట ఎమ్మెలే వంశీకృష్ణ సవాల్ విసిరారు. బల్మూరు మండలంలోని కొండనాగుల ఎస్టీ బాలుర వసతి గృహంలో శివరాత్రి రోజు విద్యార్థులకు అన్నం వండకుండా పస్తులుంచారని మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే ఎస్టీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వసతి గృహాల వైపు చూడకుండా పేద విద్యార్థులను పట్టించుకోని కేటీఆర్ ఇక్కడి నుంచి ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా ట్విట్టర్(ఎక్స్)లో మాట్లాడటం వారి రేటింగ్‌లకేనని విమర్శించారు. ఇక్కడికి వచ్చి వాస్తవాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 20 వేల పాఠశాలలను మూసివేశారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల్లో మెనూ పెంచి నాణ్యమైన భోజనం, విద్య అందిస్తున్నారని, దీనిని బీఆర్‌ఎస్ జీర్ణించుకోలేకపోతోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే తప్పుడు సమాచారంతో దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్‌కు అచ్చంపేట
ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్
Comments
Please login to add a commentAdd a comment