ఉదండాపూర్ వద్ద ఉద్రిక్తత
జడ్చర్ల: ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిర్వాసితుల ఆందోళన కారణంగా కొన్ని రోజులుగా రిజర్వాయర్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పనులను చేపట్టేందుకు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున రిజర్వాయర్ వద్దకు చేరుకుని పనులను కొనసాగించేందుకు ప్రయత్నించడంతో నిర్వాసితులు ఒక్కసారిగా అడ్డుపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించకుండా పనులు ఎలా మొదలు పెడుతారని ప్రశ్నించారు. తమకు ఆర్‌అండ్‌ఆర్ పరిహారం, ప్లాట్లు, తదితర సమస్యలను పరిష్కరించి పనులు చేపట్టాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం తమ చేతిలో లేదని, కలెక్టర్ తదితర ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఉందని పోలీసులు నిర్వాసితులకు నచ్చజెప్పారు. అయినా నిర్వాసితులు రిజర్వాయర్ కట్టపై అడ్డుగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీక్ష శిబిరంలో కూర్చోని నిరసన కొనసాగించారు. ఉదండాపూర్‌లో సర్వే పూర్తి చేశారని, వెంటనే తమకు ఆర్‌అండ్‌ఆర్ పరిహారం పెంచి ఇవ్వాలని కోరారు. అంతవరకు పనులను నిలిపేయాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల సీఐ కమలాకర్, రూరల్ సీఐ నాగార్జున గౌడ్, ఎస్‌ఐలు చంద్రమోహన్, జయప్రసాద్, మల్లేష్, వివిధ మండలాల ఎస్‌ఐలు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు కలెక్టర్‌తో నిర్వాసితులు మాట్లాడేందుకు తాము కృషి చేస్తామని పోలీసులు నచ్చజెప్పి కలెక్టర్ కార్యాలయానికి నిర్వాసితులను తీసుకెళ్లారు.
కలెక్టర్‌ను కలిసిన నిర్వాసితులు
ఉదండాపూర్ నిర్వాసితులు కలెక్టర్ విజయేదిర బోయిని కలిసి తమ సమస్యలు వివరించారు. ఆర్‌అండ్‌ఆర్ పెంపుదల చేసి త్వరితగతిన పరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌అండ్‌ఆర్ పెంపు ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం నుంచిఎప్పుడైనా పరిహారం అందే అవకాశం ఉందన్నారు. రిజర్వాయర్ పనులను అడ్డుకోవద్దని పనులు కొనసాగే విధంగా సహకరించాలని కలెక్టర్ సూచించారు. దీంతో నిర్వాసితులు తాము గ్రామంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ వెనుదిరిగారు.
పనులు అడ్డుకున్న నిర్వాసితులు
Comments
Please login to add a commentAdd a comment