తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
● బోర్లు, మోటార్లు వెంటనే
మరమ్మతులు చేయాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ‘భగీరథ’ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో ఇబ్బందుల్లేకుండా గ్రామాల్లో ఉన్న హ్యాండ్ పంప్‌లను, పైప్‌లైన్ లీకేజీలు ఉంటే మర్మమతులు చేయించాలన్నారు. మిషన్ భగీరథ వాటర్ ఓవర్ హెడ్‌ట్యాంక్‌ల మోటార్లు మరమ్మతులు చేయాలని అన్నారు. ప్రజలకు తాగునీటిని అందించడంలో సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పెండింగ్ ఉన్నచోట త్వరితగతిన పూర్తిచేయాలని, ‘ఇందిరమ్మ’ పరిశీలన త్వరగా పూర్తిచేయాలని సూచించారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ కోసం ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తున్నారని విద్యార్థులకు స్నాక్స్ తప్పక అందించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీపీఓ పార్థసారథి, డీఆర్‌డీఓ నర్సింహులు, మిషన్ భగీరథ, గ్రిడ్, ఇంట్రా ఈఈలు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. బుధవారం స్థానిక కలెక్టర్ తన చాంబర్‌లో ఎస్పీతో జానకితో కలిసి టీజీఓ ఆధ్వర్యంలో రూపొందించిన మహిళా దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకప్పుడు మహిళలు బయటకు రావాలనే కట్టుబాట్ల నుంచి సమాజంలో తాము భాగమేనని చాటి చెబుతున్నారన్నారు. ప్రోత్సహిస్తే మహిళలకు దేనినైనా సాధించే సామర్థ్యం ఉందన్నారు. మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణగౌడ్, జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, టీజీఓ మహిళా విభాగం చైర్మన్ సంధ్య, కన్వీనర్ చంద్రకళ, జిల్లా కార్యదర్శి వరప్రసాద్, టైటస్‌పాల్, లావణ్య, నాగమణి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.6,780
జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌యార్డులో బుధవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,780, కనిష్టంగా రూ.5,469 ధరలు లభించాయి. పెబ్బర్లు రూ.6,910, పత్తి గరిష్టంగా రూ.6,289, కనిష్టంగా రూ.5,469, కందులు గరిష్టంగా రూ.6,970, కనిష్టంగా రూ.6,210, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,371, కనిష్టంగా రూ.2,026, ఆముదాలు గరిష్టంగా రూ.6,077, కనిష్టంగా రూ.6,020 ధరలు లభించాయి.
మెరుగైన కంపోస్టింగ్ విధానాలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలోని డంపింగ్‌యార్డులో డీఆర్‌సీసీ, విండ్రో, వర్మి కంపోస్టింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఎస్‌డబ్ల్యూఎం) విధానాలు మెరుగ్గా అమలవుతున్నాయని సీడీఎంఏ కార్యాలయ సీడీఓ హేమలత అన్నారు. రెండోరోజు బుధవారం ఇక్కడే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మిగిలిన పది మున్సిపాలిటీల కమిషనర్లు, ఆయా విభాగాల అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఎస్‌హెచ్‌జీ, సీఈఈ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తడి, పొడి చెత్త సేకరణ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మిగతా చోట్ల విండ్రో, వర్మి కంపోస్టు చేసే పద్ధతిని దశలవారీగా ఎలా నిర్వహించాలో క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విధానాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. ముఖ్యంగా తడి, పొడి వనరుల సేకరణ ప్రణాళికాబద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు గురులింగం, రవీందర్‌రెడ్డి, వజ్రకుమార్‌రెడ్డి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ చరణ్, ఎస్‌బీఎం కన్సల్టెంట్ సుమిత్‌రాజ్ పాల్గొన్నారు.
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
Comments
Please login to add a commentAdd a comment