12 రోజులైనా జాడే లేదు
అచ్చంపేట/అమ్రాబాద్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల వెలికితీతపై ఉత్కంఠ వీడటం లేదు. 12 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా కార్మికుల ఆచూకీ లభించలేదు. రోజు మాదిరిగానే బుధవారం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగించాయి. కొన్ని రోజులుగా కష్టపడి పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు మళ్లీ తెగిపోయింది. సొరంగంలోని మట్టి, ఇతర వ్యర్థాలను లోకో ట్రైన్ ద్వారానే తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నీటి ఊట ఏ మాత్రం తగ్గలేదు. టన్నెల్‌లో ఉబికి వస్తున్న నీటి ఊటతో డ్రిల్లింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో బురద, మట్టి ఇతర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. అయితే సహాయక బృందాల మధ్య సమన్వయం కొరవడటంతో, ఎవరికి వారు ఇక్కడ.. అక్కడ అన్నట్టుగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో 10 రోజులైనా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోకో ట్రైన్ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుండటంతో మట్టి, రాళ్లతో పాటు కట్‌చేసిన టీబీఎం మెషీన్ విడి భాగాలను బయటకు తరలిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వచ్చి వెళ్లిన నాటి నుంచి అధికారుల హడావుడి అంతగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment