క్రేన్ మరమ్మతులకు వచ్చి.. హత్య చేశాడు
బిహార్ కూలి హత్య కేసును ఛేదించిన పోలీసులు
● హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో నిందితుడి అరెస్ట్
● డీఎస్పీ వెంకటేశ్వర్లు
జడ్చర్ల: ఓ పరిశ్రమలో భారీ క్రేన్‌ను మరమ్మతు చేయడానికి వచ్చిన వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. హత్య చేసిన నిందితుడు పరారీ కాగా పోలీసులు ఛేదించి పట్టుకున్నట్లు డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిందితుడు వినయ్ క్రేన్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మండలంలోని పెద్దపల్లి గ్రామ శివారులో గల విర్కో బల్క్‌డ్రగ్ కంపెనీలో క్రేన్ మరమ్మతులకు గురైంది. దీని రిపేర్ చేసేందుకు గత నెల 24వ తేదీన పూణే నుంచి వినయ్ జడ్చర్లకు వచ్చాడు. అదేరోజు క్రేన్‌ను పరిశీలించి మరమ్మతుకు అవసరమైన విడిభాగాలను తెప్పించేందుకు క్రేన్ యజమానికి సమాచారమిచ్చి రాత్రికి పూణేకు బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే క్రేన్ ఆపరేటర్స్ ఉండేందుకు బీఆర్‌రెడ్డి గార్డెన్‌లో ఏర్పాటుచేసిన రూంలో అతడు బసచేశాడు. పూణే వెళ్లేందుకు గది నుంచి బయటకొచ్చి మెట్లపైె కూర్చున్నాడు. మెట్లు ఎక్కే క్రమంలో మద్యం మత్తులో ఉన్న హతుడు బిహార్ రాష్ట్రానికి చెందిన కూలి రషీద్‌ఖాన్ నిందితుడు వినయ్‌ను తాకుతూ వెళ్లాడు. ఈక్రమంలో వారి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. రషీద్‌ఖాన్ తలను వినయ్ గోడకేసి బాదడంతో బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. మృతుడి సెల్‌ఫోన్‌ను తీసుకొని నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బీఆర్‌రెడ్డి గార్డెన్‌లో నివాసం ఉంటున్న కూలీలను విచారించారు. వినయ్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి అతడి యజమానిని విచారించగా అసలు విషయం బయటపడింది. హత్య అనంతరం వినయ్ యజమానితో జరిగిన విషయం చెప్పాడు. దీంతో అతడు పోలీసులకు లొంగిపోవాలని యజమాని సూచించాడు. నిందితుడు మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్టాండ్‌లో నిందితుడిని అరెస్ట్‌చేశారు. హతుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సీఐ కమలాకర్, ఎస్‌ఐలు మల్లేష్, చంద్రమోహన్, జయప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment