విద్యుత్ సరఫరా నిలిపివేయాలంటూ రైతుల ఆందోళన
● చివరి ఆయకట్టుకు నీరు అందడంలేదని వాదన
● కోతలు విధించలేమన్న అధికారులు
● విద్యుత్ సిబ్బందితో వాగ్వాదం
ధరూరు : వ్యవసాయానికి కరెంటు ఇవ్వాలని పోరాడిన ఘటనలు ఇప్పటివరకు చూశాం.. కానీ వ్యవసాయానికి కరెంట్ కట్ చేయాలంటూ రైతులు ఆందోళన బాట పట్టిన వింత ఘటన ధరూరు మండలంలో చోటుచేసుకుంది. నిరంతరాయంగా కరెంటు ఇవ్వడంతో నెట్టెంపాడు కాల్వ కింద ఉన్న రైతులకు నీరందడం లేదని, పగలు రెండు లేదా మూడు గంటలు కరెంట్ సరఫరా నిలిపివేయాలని, రాత్రి వేళ పూర్తిగా బంద్ చేయాలని రైతులు అల్వాల పాడు సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. 104 కాల్వకు నీళ్లు వస్తున్నందున చివరి ఆయకట్టులో ఉన్న కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె, వెంకటాపురం, ఈర్లబండ గ్రామాల రైతులకు ర్యాలంపాడు నుంచి విడుదలయ్యే నీరు అందడం లేదన్నారు. కాల్వ ముందు భాగంలో ఉన్న పొలాలకే నీళ్లు వస్తున్నాయంటూ విద్యుత్ సిబ్బందితో రైతులు వాగ్వాదానికి దిగారు. విషయాన్ని ఏఈ, ఏడీఈలకు ఫోన్‌లో సమాచారమివ్వగా వారు అక్కడి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడం అన్నది తమ చేతుల్లో లేదని, ఈవిషయంలో తామేమీ చేయలేమని వారు తేల్చి చెప్పారు. దీంతో రైతులు కలెక్టర్‌కు విన్నవిస్తామని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment