
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
పాలమూరు: సమాజంలో ప్రతి ఒక్క అమ్మాయి ఉన్నత చదువులు చదవడంతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళ కళాశాలలో గురువారం అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి హాజరై మాట్లాడారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. సమాజంలో మహిళ పాత్ర చాలా గొప్పదని, మహిళ లేకపోతే మానవ మనుగడ లేదన్నారు. కుటుంబంలో పురుషులతో పాటు మహిళలకు సమాన ఆస్తి హక్కు ఉంటుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అత్యాచారాలు, గృహహింస చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment