సారూ.. మా బతుకులు ఆగమైపోతున్నాయ్
కోయిలకొండ: సారూ.. మా బతుకులు ఆగమైపోయాయ్.. రైతు రుణమాఫీ రాలే.. రైతుబంధు పడలే.. కరెంటు సక్కగా లేదు.. బోర్లలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి సారు అంటూ.. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో ఓ రైతు తన గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండలంలోని దమాయపల్లి వద్ద బాలయ్య అనే రైతు వ్యవసాయ పొలంలో కొత్తగా వేస్తున్న బోరును చూసి అక్కడికి వెళ్లి రైతును పలకరించారు. దీంతో రైతు మాట్లాడుతూ నాలుగున్నర ఎకరాల వరి పూర్తిగా ఎండిపోయింది.. పంటను కాపాడేందుకు మల్లో బోరు వేస్తున్న.. 300 ఫీట్లు దాటిన చుక్క నీరు లేవు.. మొత్తం రాళ్లు, రప్పలే వస్తున్నాయి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మీరే ఏదైనా చేయండి సార్ అంటూ వేడుకున్నారు. మళ్లీ కాంగ్రెస్ పాలనలో పాత రోజులు వచ్చినాయని వాపోయాడు. ఇది ఒక్క బాలయ్య ఆవేదనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మాజీ మంత్రి పేర్కొన్నారు. సాగునీటి నిర్వహణ సరిగా లేకపోవడంతో జలాశయాల్లో ఉన్న నీరంతా ఖాళీ అయ్యిందని, రిజర్వాయర్ల కింద పంటలన్నీ ఎండిపోతున్నాయని, ఈ దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రైతు రుణమాఫీ చేసి ఉంటే.. రైతుబంధు సకాలంలో వేసి ఉంటే.. 24 గంటల కరెంటు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదన్నారు. ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం బాధ్యత వహించి ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
మాజీమంత్రితో ఓ రైతు ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment