మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి
జెడ్పీసెంటర్( మహబూబ్‌నగర్): మహిళలకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించాలని, అప్పుడు వారు అభివృద్ధి చెందుతారని కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో పని చేస్తూ ముందుకు వెళుతున్నారని అన్నారు. ఇంట్లో, పని చేసే స్థలంలో వివక్ష తొలగిపోవాలన్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం మహిళా ఉద్యోగులకు నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయగా.. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, మోహన్‌రావు, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిని జరీనా బేగం, భూగర్భ జల వనరుల శాఖ డీడీ రమాదేవి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇందిరా, వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారిణి మంజుల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment