అడుగడుగునా ఆటంకాలు
సొరంగంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 15 రోజులైన వారీ ఆచూకీ లభ్యం కాలేదు. ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది.
డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో..
ప్రమాదం జరిగిన సొరంగంలో పరిశోధన చేసేందుకు కేరళ నుంచి వచ్చిన కాడవర్ డాగ్స్ కూడా ఇది వరకు గుర్తించిన డాగ్స్ స్థానాల్లోనే గుర్తించాయి. 13.500 కి.మీ., అవుతల ఒకే దగ్గర ముగ్గురు వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించాయి. కార్మికులు చిక్కుకున్నట్లు డాగ్స్ చూపించిన ప్రదేశాల్లో శనివారం రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం పరికరాలు గ్యాస్ కట్టర్‌తో కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటికి పంపించారు. కూలిపడిన పైకప్పు మట్టి దిబ్బలను హిటాచీతో ఒకవైపు తరలిస్తున్నారు. రోజుకో బృందాన్ని సింగరేణి నుంచి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సొరంగంలో వస్తున్న దుర్వాసన సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తోంది.
15 రోజులైనా లభ్యం కాని
కార్మికుల ఆచూకీ
ఉబికివస్తున్న నీటితో
సహాయక చర్యలకు విఘాతం
అడుగడుగునా ఆటంకాలు
Comments
Please login to add a commentAdd a comment