బ్రహ్మోత్సవాలకు ‘దక్షిణకాశి’ ముస్తాబు
● రేపటి నుంచి కందూరు
రామలింగేశ్వరుడి ఉత్సవాలు
● 12న స్వామివారి కల్యాణం,
14న రథోత్సవం
అడ్డాకుల:
కందూరు శివారులో స్వయంభూగా వెలసి ‘దక్షిణకాశి’గా గుర్తింపు పొందుతున్న శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మంగళవారం నుంచి ఈ నెల 16 వరకు కొనసాగే స్వామివారి ఉత్సవాల కోసం ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శైవులకు నిజకాశీలాంటి ఆలయం వద్ద మొదలయ్యే ఉత్సవాలు ఏప్రిల్ 6న జరిగే శ్రీరామ నవమిన ముగుస్తాయి. కాశీలో తప్ప మరెక్కడా లేని కల్పవృక్షాలు (కబంధ) కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయం ఆవరణలో కనిపిస్తాయి. కాశీ తర్వాత కల్ప వృక్షాలు ఇక్కడే ఉన్నాయని పురాణం చెబుతోంది.
కార్యక్రమాలు ఇలా..
● ఈ నెల 11న భూతబలి, యాగశాల ప్రవే శం, అంకురార్పణం, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
● 12న పార్వతీసమేత శ్రీరామలింగేశ్వరస్వామి కల్యాణం జరిపిస్తారు.
● 13న స్వామివారి ప్రభోత్సవం నిర్వహిస్తారు.
● 14న అర్ధరాత్రి రథోత్సవం (తేరు) వైభవంగా కొనసాగుతుంది.
● 15న గవ్యాన్తం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వృషభవాహన సేవ ఉంటుంది.
● 16న రుద్రహోమం, మహాపూర్ణాహుతి, త్రిశుల స్నానం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈఓ రాజేశ్వరశర్మ తెలిపారు. మరుసటి రోజు నుంచి మొదలయ్యే జాతర ఏప్రిల్ 6న జరిగే శ్రీరామ నవమి రోజున ముగియనుంది.
నేడు జడ్చర్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
జడ్చర్ల టౌన్: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం నిర్వహిస్తున్నట్లు చైర్‌పర్సన్ పుష్పలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సమావేశం జరగాల్సి ఉండగా.. 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో తేడాల వల్ల కొందరు వార్డు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో వాయిదా వేశారు. తాజాగా నిధుల కేటాయింపు సమానంగా చేస్తూ.. సోమవారం సమావేశం నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాలకు ‘దక్షిణకాశి’ ముస్తాబు
Comments
Please login to add a commentAdd a comment