కష్టం బీసీలది.. అధికారం రెడ్డీలదా?
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ‘ఏళ్లకు ఏళ్లుగా భుజాలు కాయలు కాసేలా బీసీలు పార్టీల జెండాలు మోస్తూనే ఉన్నారు.. అధికారం అనుభవిస్తున్నది మాత్రం రెడ్డీలు’ అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ అవకాశముంటే అక్కడ బీసీలు అధిక సంఖ్యలో పోటీ చేసి సత్తాచాటాలని పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లాలోని అగ్రకుల నాయకులైన సీఎం రేవంత్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి పార్టీలు మారుతూ అధికారాన్ని అనుభవిస్తున్నారన్నారు. బీసీ బిడ్డ ముదిరాజ్ సింహంగా పేరొందిన ఎర్రసత్యంను బుల్లెట్లతో కాల్చి చంపిన వారే ఆయన ఆశయాలను కొనసాగిస్తామని కపట ప్రేమ చూపుతున్నారని, బీసీలంతా ఈ విషయాన్ని గమనించాలన్నారు. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న కుట్రలను దృష్టిలో ఉంచుకొని ఒక బీసీ అభ్యర్థికి ఏ పార్టీ నుంచి అవకాశం వచ్చినా బీసీలంతా ఐక్యంగా ఉండి గెలిపించుకోవాలని అన్నారు. 70 ఏళ్ల పాలనలో అధికారాన్ని అనుభవించి అగ్రకులాలు ఆస్తులు కూడగట్టుకుంటే వెనుకబడిన కులాలపై అప్పులు మోపారని మండిపడ్డారు. మీ ఓట్లు మాకొద్దని, దమ్ముంటే మా బీసీల ఓట్లు మీకొద్దని చెప్పాలని సవాల్ విసిరారు. ఇది బీసీల రాజకీయ చైతన్య సదస్సు కాదని.. రెడ్లకు, బీసీలకు విడాకుల సభ అన్నారు. 2028లో ముఖ్యమంత్రిగా బీసీలు అయి తీరుతారన్నారు.
● పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే 9 నియోజకవర్గాల్లో మీరే ఉన్నారని, పార్టీలు మారుతూ అధికారాన్ని అనుభవిస్తున్నారని, మీరు బీసీలు పార్టీలు మారొద్దని నీతులు చెబుతున్నారని విమర్శించారు. బీసీ ప్రజా ప్రతినిధులారా ఎక్కడ అవకాశమున్నా పోటీ చేయాలని, తీన్మార్ మల్లన్న పూర్తి మద్దతుతో గెలుపులో భాగమవుతామన్నారు. బీసీ రాజ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను ఎత్తివేస్తామని, దొంగదారిన వచ్చిన ఉద్యోగాలను రద్దు చేసి రికవరీ చేస్తామన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి గెలిచిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, రజక బిడ్డ వీర్లపల్లి శంకరయ్య మంత్రి ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో బీసీ టైమ్స్ అధినేత సంగెం సూర్యారావు, సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డే జానయ్య, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర నాయకుడు ప్రణీల్‌చందర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజు, నిర్మల, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ మైత్రి యాదయ్య, బీసీ సమాజ్ అధ్యక్షుడు శ్రీనివాస్‌సాగర్, తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, లక్ష్మణ్, వన్నాడ అంజన్న, కావలి శంకర్ పాల్గొన్నారు.
‘స్థానికం’లో బీసీలు సత్తా చాటాలి
అప్పులు మాకు.. ఆస్తులు మీకు
పార్టీలు మారొద్దని మీరు నీతులు చెబుతారా
2028లో బీసీయే రాష్ట్ర ముఖ్యమంత్రి
బీసీ రాజకీయ చైతన్య సదస్సులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Comments
Please login to add a commentAdd a comment