ఆర్టీసీ బస్సు కిందపడి వృద్ధురాలు..
ఆత్మకూర్: ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో వృద్ధురాలు బస్సు కింద పడి తీవ్ర గాయాలపాలై మృతి చెందిన సంఘటన ఆత్మకూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై నరేందర్ తెలిపిన వివరాలు.. చిన్నచింతకుంట మండలం అప్పంపల్లికి చెందిన తిమ్మమ్మ(67) ఆదివారం గ్రామస్తులతో కలసి ఆత్మకూర్‌లో జరిగే సంతలో కూరగాయలు కొనేందుకు వచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో స్థానిక గాంధీచౌక్‌లో బస్సుకోసం ఎదురు చూస్తుండగా మహబూబ్‌నగర్ డిపోకు చెందన బస్సు వచ్చింది. బస్సు ఎక్కుతుండగా ముందుకు కదలడంతో తిమ్మమ్మ వెనుక టైర్ల కింద పడి గాయాల పాలైంది. గమనించిన తోటి ప్రయాణికులు 108లో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్తతోనే తిమ్మమ్మ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment