కంపుకొడుతున్న కాలనీలు
డ్రెయినేజీలు అస్తవ్యస్తం
● దోమలు, ఈగలకు ఆవాసంగామురుగు కాల్వలు
● వివిధ డివిజన్లలో దుర్వాసనతో ప్రజల నరకయాతన
● ముక్కు మూసుకుని వెళ్తున్న వైనం
● పట్టించుకోని మున్సిపల్ అధికారులు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో చాలా చోట్ల డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇన్నాళ్లు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్‌నగర్ కాస్తా ఇటీవల కార్పొరేషన్‌గా మారింది. స్థాయి పెరిగినా కొత్తగా ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో నగర పరిధిలోని 49 డివిజన్లలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. వాస్తవానికి మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం గత జనవరి 26న ముగిసి ప్రత్యేక అధికారి పాలనలోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. ముఖ్యంగా మురుగుకాల్వలు కంపు కొడుతున్నాయి. ఏ వీధి చూసినా చిన్న, చిన్న కాల్వలతో మురుగు పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. మర్లు, శాంతినగర్, విఘ్నేశ్వరకాలనీ తదితర ప్రాంతాల్లో అన్నీ చిన్న గల్లీలే ఉన్నాయి. చాలాచోట్ల డ్రెయినేజీలు కనిపించవు. ఎవరికి వారు ఇళ్ల యజమానులు మురుగు కాల్వలు తాత్కాలికంగా నిర్మించినవే ఉన్నాయి. దీంతో దుర్గంధం మధ్య సహవాసం చేస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. 13 ఏళ్ల క్రితం మున్సిపాలిటీలో కలిసిన అప్పన్నపల్లి, ఎనుగొండ, ఎదిర, పాలకొండ, క్రిష్టియన్‌పల్లి, బండమీదిపల్లి, చిన్నదర్‌పల్లి, బోయపల్లి, దొడ్డలోనిపల్లి, తిమ్మసానిపల్లితో పాటు ఇటీవల కార్పొరేషన్‌లో విలీనమైన జైనల్లీపూర్, దివిటిపల్లిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆయా గ్రామాలలో డ్రెయినేజీలు ఎక్కడా సరిగా లేవు. ఎక్కడికక్కడ రోడ్లపై మురుగు పారుతుండటంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇన్నేళ్లయినా మున్సిపల్ అధికారులు డ్రెయినేజీ నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం పలు డివిజన్లను ‘సాక్షి’ పరిశీలించగా ఈ విషయాలు వెలుగు చూశాయి.
ఎవరూ పట్టించుకోరు..
మా ప్రాంతంలో ఇళ్ల మధ్య నుంచి ప్రవహిస్తున్న పెద్ద కాల్వతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెలకోసారి మాత్రమే అందులోని చెత్తను పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. డ్రెయినేజీ నిర్మించాలని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం దక్కలేదు. ఎస్సీ కమ్యూనిటీ హాలు మొదలుకుని రైసా మసీదు వరకు అటు, ఇటు మోరీలు నిర్మించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగల సైర విహారంతో తరచూ రోగాల బారిన పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. – కౌకుంట్ల మహేష్, పాతపాలమూరు
మురుగుతో దుర్గంధం
మా ఇంటి ముందున్న చౌరస్తాలో మురుగు ఏరులైపారుతోంది. గట్టు ప్రాంతంలో నివసిస్తున్న ఇళ్లవారు కిందికి అలాగే మురుగును బయటకు వదిలేస్తున్నారు. డ్రెయినేజీ నిర్మించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగం లేదు. అప్పట్లో మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు వచ్చి చూసి పోయారు. ఎగువ నుంచి దిగువకు కొంత దూరం సీసీరోడ్డును తొలగించి అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది.
– వారాల కృష్ణ, కృష్ణ టెంపుల్‌చౌరస్తా, పద్మావతికాలనీ
●
కంపుకొడుతున్న కాలనీలు
కంపుకొడుతున్న కాలనీలు
కంపుకొడుతున్న కాలనీలు
కంపుకొడుతున్న కాలనీలు
Comments
Please login to add a commentAdd a comment