పీయూలో 27, 28 తేదీల్లో వర్క్‌షాప్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎంబీఏ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టుపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్‌షాప్ ఎంతో ఉపయోగకరం అని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కన్వీనర్ అర్జున్‌కుమార్, కో కన్వీనర్ నాగసుధ, జావిద్‌ఖాన్, అరుంధతి, గాలెన్న తదితరులు పాల్గొన్నారు.
31 లోగా చెల్లించి రాయితీ పొందండి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ యజమానులు మార్చి 31లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లిస్తే ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించినట్లు కలెక్టర్ విజయేందిర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్ 08542–241165, మహబూబ్‌నగర్ నగర పాలక సంస్థలో హెల్ప్‌లైన్ నంబర్ 7093911352ను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమాచారం పొందవచ్చని ప్లాటు యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 2020 ఆగస్టు 26 నాటికి లేఔట్‌లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయితే మిగిలిన వాటికి కూడా ఎల్‌ఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరణ అవకాశం కల్పించినట్లు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ ద్వారా నిర్ణీత నమూనాలో నూతన దరఖాస్తులు స్వీకరించి ఎల్‌ఆర్‌ఎస్ కోసం మున్సిపల్ శాఖకు వివరాలు పంపించి క్రమబద్ధీకరిస్తారని పేర్కొన్నారు.
మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సమాజంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డీఆర్డీఓ నర్సిములు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా మహిళా సమాఖ్య భవనంలో మానవ అక్రమ రవాణా నివారణపై ఏపీఎంలు, సీసీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, శ్రమ దోపిడీ, లైంగిక దోపిడీపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పని ఉందని మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రదేశాలకు తీసుకుపోయి లైంగికదాడికి గురిచేస్తే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరిపైనా అనుమానాలు వస్తే వెంటనే పోలీసులకు 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. శిక్షణ పొందిన ఏపీఎంలు సీసీలు స్థానికంగా ఉంటే వీఓలకు అవగాహన కల్పిస్తారని కోరారు. కార్యక్రమంలో డీపీఎం ఆలూరి చెన్నయ్య టీఓటీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ల ఖరారు తర్వాతే ఫలితాలివ్వాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి, వాటిని ఖరారు చేసే వరకు గ్రూప్–1, 2, 3 ఫలితాలను ప్రకటించవద్దని ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీయూ మెయిన్ గేట్ వద్ద మంగళవారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్న కొంత మంది స్వార్థపరుల ఒత్తిడి మేరకు మాదిగ విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీయాలన్న కుట్రతో ముందస్తుగా గ్రూప్స్ ఫలితాలను విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణలో ఏబీసీడీ వర్గీకరణ అనంతరం మాత్రమే ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామని ప్రభుత్వం చెబుతూనే ఫలితాల విడుదలకు కసరత్తు చేయడం బాధాకరమని, రిజర్వేషన్‌ల బిల్లు పెట్టి వర్గీకరణ చేసే వరకు నిరసన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్‌పీ అధ్యక్షుడు టైగర్ అంజయ్య, వీరస్వామి, జేఏసీ చైర్మన్ రాము, దాసు, శ్రీను, రవితేజ, రాము, నాగేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
పీయూలో 27, 28 తేదీల్లో వర్క్‌షాప్
Comments
Please login to add a commentAdd a comment