‘ఇంటర్’ వాల్యూయేషన్ ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల వాల్యూయేషన్‌ను అధికారులు మంగళవారం ప్రారంభించారు. జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో వాల్యూయేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి 20 వేలకు పైగా సంస్కృతం సబ్జెక్టుకు సంబంధించిన జవాబుపత్రాలు క్యాంప్‌నకు చేరాయి. తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించిన జవాబుపత్రాలు ఒకట్రెండు రోజుల్లో రానున్నాయి. వీటికి అధికారులు కోడింగ్ ప్రక్రియ చేపట్టారు. మొత్తంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి రెండు లక్షలకు పైగా జవాబు పత్రాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను క్యాంప్‌నకు రావాలని ఆదేశించారు. మొత్తంగా రెండు వారాల్లో వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
11,690 మంది హాజరు
జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్–1 ఏ, బోటనీ–1, పొలిటికల్ సైన్స్–1 పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ మేరకు మొత్తం 36 పరీక్ష కేంద్రాల్లో 11,690 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరో 326 మంది గైర్హాజరయ్యారు. పలు కేంద్రాల్లో సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో పాటు ఇంటర్ బోర్డు అధికారులు పరిశీలించారు. కాగా.. మంగళవారం జరిగిన పరీక్షలో కూడా తప్పులు వచ్చినట్లు పలువురు విద్యార్థులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment