రైతు ఆత్మహత్యాయత్నం
గట్టు: మండలంలోని మిట్టదొడ్డికి చెందిన రైతు మారెప్ప గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నానికి యత్నించారు. భార్య సరోజమ్మ కథనం మేరకు.. మారెప్పకు గ్రామ శివారులో పొలం ఉండగా, పక్కనే గ్రామానికి చెందిన సీడ్ ఆర్గనైజర్ నర్సింహారెడ్డి, నల్లారెడ్డి, కిష్టారెడ్డి వ్యవసాయ భూములున్నాయి. రెండు పొలాల మధ్య నక్ష బాట ఉండగా.. సదరు వ్యక్తులు బాటను ఆక్రమించే ప్రయత్నం చేశారు. బాట ఆక్రమణపై గతంలో రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండల, జిల్లా సర్వే అధికారులు వచ్చి సర్వే చేసినా ఆక్రమించుకునేందుకు యత్నిస్తే అడ్డుకోగా తమపై అట్రాసిటి కేసు నమోదు చేయించడంతో పాటు దాడిచేసి గాయపర్చినట్లు వివరించారు. దీంతో మానసిక వేధనకు గురై తన భర్త గడ్డి మందు తాగాడని తెలిపారు. వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించామని, పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్లు సరోజమ్మ చెప్పారు.
యువకుడి
బలవన్మరణం
ఉండవెల్లి: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉండవెల్లి శివారులో గురువారం చోటు చేసుకుంది. రైల్వే కానిస్టేబుల్ అశోక్ వివరాల మేరకు.. మండలంలోని కలుగొట్ల గ్రామానికి చెందిన గొల్ల మధు (21) కర్నూలులో జరిగిన వివాహానికి వెళ్లి.. స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. ఉండవెల్లి శివారులో గుర్తుతెలియని రైలు వస్తుండగా.. రైల్వే బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి మృతికిగల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే కానిస్టేబుల్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
చిన్నచింతకుంట: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన చిన్నచింతకుంట మండలం పర్దీపురం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాంలాల్ నాయక్ వివరాల మేరకు.. పర్దీపూర్‌కు చెందిన కుమ్మరి రాజు (31) స్వగ్రామం నుంచి లాల్‌కోటకు బైక్‌పై వెళ్తుండగా.. జల్మానాయక్ తండాకు చెందిన రమేష్ నాయక్ అతివేగంగా బైక్‌పై వచ్చి ఢీకొట్టాడు. ప్రమాదంలో రాజుకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. రమేష్ నాయక్‌కు స్వల్పగాయాలు కావడంతో జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైతు ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment