ఎస్‌ఎల్‌బీసీ ఘటన దురదృష్టకరం
అమ్రాబాద్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాద ఘటన దురదృష్టకరమని.. 8 మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్య వెఖరి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. గురువారం ఎస్‌ఎల్‌బీసీని పౌరహక్కుల సంఘం, కుల నిర్మూలన వ్యతిరేక పోరాట సమితి బృందంతో కలిసి సందర్శించారు. రెస్క్యూ బృందం, కలెక్టర్ బదావత్ సంతోష్‌తో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు వేగవంతంగా ఉన్నాయని.. సొరంగంలో ప్రమాదం జరగకముందే పరిస్థితిని పసిగట్టి ఉంటే ప్రాణనష్టం జరిగేది కాదన్నారు. గత ప్రభుత్వం 2019లో ఇన్‌లెట్ వన్ వద్ద పనులు ఎందుకు నిలిపివేసిందో ప్రస్తుత ప్రభుత్వానికి విషయం చెప్పలేదా అని ప్రశ్నించారు. నేటికీ ఏడుగురు కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో ఆయా కుటుంబాల ఆవేదన వర్ణనాతీతమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి, జేపీ కంపెనీ మరో రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కులనిర్మూలన వ్యతిరేక సమితి రాష్ట్ర సభ్యుడు లక్ష్మీనారాయణ, పౌరహక్కుల సంఘం జిల్లా నాయకులు పి.బాలయ్య, జె.బాలయ్య, ఎన్.లక్ష్మీనారాయణ, వెంకటేష్ తదితరులు ఉన్నారు.
8 మంది కార్మికుల మృతి ప్రభుత్వ నిర్లక్ష్యమే..
పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యకుడు డా.గడ్డం లక్ష్మణ్
Comments
Please login to add a commentAdd a comment