పాత కక్షలతో వేటకొడవలితో దాడి
కోస్గి రూరల్: పాత కక్షలతో సొంత పెద్దనాన్నపై వేట కొడవలితో దాడి చేసిన సంఘటన మండలంలోని పోతిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఈర్లపల్లి మల్లప్ప, రామయ్య మధ్య భూ పంపకాలు జరిగాయి. అయితే రామయ్య కుమారుడు నర్సింహులు వరి చేనుకు నీరు పారించే విషయంలో తరుచుగా మల్లప్ప కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. దీంతో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సర్దిచెప్పారు. అయితే నర్సింహులు సోమవారం పొలంలో పనులు చేసుకుంటున్న మల్లప్ప దగ్గరకు వెళ్లి మరోమారు గొడవ పడి తన వెంట తెచ్చుకున్న వేట కొడవలితో మల్లప్ప మెడ, రెండు చేతులపై దాడి చేశాడు. గమనించిన చుట్టుపక్కల పొలాల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా హుటాహుటిన కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో పాలమూరుకు అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మల్లప్ప కుమారుడు ఇసువయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ బాలరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment