జిల్లాకేంద్రంలో పరీక్ష రాసి బయటికి వస్తున్న విద్యార్థులు
పరీక్ష కంటే ముందు దేవాలయంలో విద్యార్థులు.. మాడ్రన్ స్కూల్‌లో నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు కావడంతో చాలా మంది విద్యార్థులు పరీక్ష కేంద్రాల అడ్రస్‌లు వెతుక్కోవడం, దూరం నుంచి వచ్చేవారు హడావుడిగా చేరుకున్నారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా 8.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. 60 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 12,785 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 12,744 మంది హాజరై 41 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 12,769 మందికి 12,730 మంది హాజరై 39 మంది గైర్హాజరయ్యా రు. ప్రైవేటు విద్యార్థులు 16 మందికి 14 మంది హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీలు చేశారు. డీఎల్‌ఓ 5, డీఈఓ 11, ఏసీజీఈ 4, ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 25 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. మొత్తానికి తొలిరోజు జరిగిన తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రంలో అపెక్స్ స్కూల్ వద్ద, టీడీ గుట్ట, వన్‌టౌన్ ప్రాంతాల్లో పరీక్ష జరిగే సమయంలో పలు జిరాక్స్ సెంటర్లు తెరుచుకుని ఉన్నా.. అధికారులు పట్టించుకోలేదు.
ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. శుక్రవారం ఆమె గాంధీ రోడ్డు, క్రీస్తు జ్యోతి విద్యాలయం, భూత్పూర్ జెడ్పీ స్కూళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పరీక్ష నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. కేంద్రంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర విద్యుత్ సరఫరా, లైట్లు, ఫ్యాన్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, తదితరులున్నారు.
జిల్లావ్యాప్తంగా పదో తరగతి
పరీక్షలు ప్రారంభం
12,744 మంది హాజరు.. 41 మంది గైర్హాజరు
తొలి రోజు ప్రశాంతం