చికిత్స పొందుతూ యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ యువకుడు మృతి

Published Tue, Mar 25 2025 1:45 AM | Last Updated on Tue, Mar 25 2025 1:41 AM

ఎర్రవల్లి: మండలంలోని కొండపేటకు చెందిన గద్వాల నరహరి (25) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఎస్‌ఐ వెంకటేష్‌ వివరాల మేరకు.. నరహరి పెళ్లి విషయంలో ఆదివారం కుటుంబ సభ్యులు మందలించారు. ఈ క్రమంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని మనస్థాపానికి గురై పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడి తండ్రి గద్వాల సింగోటం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు..

గద్వాల: అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన ధరూరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీహరి వివరాల మేరకు.. అయిజ మండలం చిన్నతాండ్రపాడు చెందిన కుర్వకిష్టన్న అనే వృద్ధుడు ఇటీవల కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకపోయింది. వృద్ధుడి అదృశ్యంపై అయిజ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్‌ కేసు నమోదైంది. ఈ క్రమంలో సోమవారం జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ వద్ద ముళ్లపొదల్లో శవమై కనిపించాడు. విషయాన్ని స్థానిక జాలర్లు ధరూరు పోలీసులకు తెలియజేయగా.. కుర్వ కిష్టన్నగా గుర్తించారు. దాదాపు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయాన్ని కుర్వ కిష్టన్న కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు.

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ఊట్కూరు/కోస్గి/భూత్పూర్‌: ఊట్కూరు మండలంలోని అవుసలోనిపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి అక్రమంగా ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కృష్ణంరాజు తెలిపారు. గ్రామానికి చెందిన సాలేరాముపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

● కోస్గి మండలంలో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాల్‌రాజ్‌ తెలిపారు. మండలంలోని కడంపల్లి వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

● భూత్పూర్‌ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్‌ సమీపంలో అనుమతుల్లేకుండా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్‌ను పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. విధుల్లో భాగంగా సోమవారం గ్రామాల్లో గస్తీ తిరుగుతున్న పోలీసులకు ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ కనపడగా తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి లేదు. దీంతో టిప్పర్‌ డ్రైవర్‌ నక్కలి సురేందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

నంబర్‌ ప్లేట్‌ లేని ట్రాకర్‌..

నాగర్‌కర్నూల్‌ క్రైం: నంబర్‌ ప్లేట్‌ లేని ఇసుక ట్రాక్టర్‌ను సీజ్‌ చేసినట్లు ఏఎస్పీ రామేశ్వర్‌ సోమవారం తెలిపారు. జిల్లాకేంద్రంలో ఇసుక డంప్‌ చేసి వస్తుండగా ఎస్పీ కార్యాలయం ఎదుట ట్రాక్టర్‌ను తనిఖీ చేయడంతో నంబర్‌ ప్లేట్‌ లేనట్లు గుర్తించి జిల్లా రవాణాశాఖ అధికారికి అప్పగించినట్లు వివరించారు. ఎవరైనా నంబర్‌ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రామన్‌పాడులో 1,016 అడుగుల నీటిమట్టం

మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో సోమవారం 1,016 అడుగులకు నీటిమట్టం వచ్చి చేరిందని ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా 275 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుందని.. సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారని పేర్కొన్నారు. రామన్‌పాడు నుంచి ఎన్టీఆర్‌ కాల్వ ద్వారా 27 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 57 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు.

చికిత్స పొందుతూ యువకుడు మృతి 
1
1/1

చికిత్స పొందుతూ యువకుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement